వరుడి కోరిక.. 4 లక్షల విలువైన మాస్కు!

11 Jul, 2020 12:44 IST|Sakshi

అహ్మదాబాద్‌: కరోనా కాలంలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ఓ వరుడికి వింత కోరిక పుట్టింది. లాక్‌డౌన్‌ నిబంధనల మధ్య నిరాడంబరంగా వివాహం జరిగినా తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలనుకున్నాడు. అందుకోసం ఏకంగా లక్షల రూపాయలు ఖర్చు చేసి తనకు, కాబోయే భార్య కోసం ఓ షాపులో వజ్రాల మాస్కు తయారు చేయించుకున్నాడు. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో చోటుచేసుకుంది. ఇక పెళ్లి కొడుకు కోరిక మేరకు తమ డిజైనర్లు రూపొందించిన మాస్కులకు మంచి డిమాండ్‌ ఏర్పడిందని.. దీంతో మరిన్ని వజ్రాల మాస్కులను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైనట్లు ఆభరణాల వ్యాపారి దీపక్‌ చోక్సీ తెలిపారు. లక్షన్నర నుంచి 4 లక్షల రూపాయల ఖర్చు పెడితే బంగారు, వజ్రాల మేళవింపుతో కూడిన మాస్కులను అందిస్తామని చెబుతున్నారు. (బడా బాబుకి బంగారు మాస్క్‌, ధర ఎంతంటే)

ఈ విషయం గురించి దీపక్‌ చోక్సీ మాట్లాడుతూ.. ‘‘లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు తర్వాత ఓ వ్యక్తి మా దుకాణానికి వచ్చారు. తన పెళ్లి జరుగబోతోందని.. తనకు, వధువు కోసం వెరైటీ మాస్కులు కావాలని అడిగారు. దీంతో మాకు ఓ ఐడియా వచ్చింది. యెల్లో గోల్డ్‌, అమెరికన్‌ వజ్రాలను ఉపయోగించి మాస్కులు తయారు చేశాం. దీని ధర ఇంచుమించు లక్షన్నర. ఇక వైట్‌ గోల్డ్‌, రియల్‌ డైమండ్స్‌తో మరో మాస్కు కూడా తయారు చేశాం. దీని కోసం 4 లక్షల రూపాయాలు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు అవసరానికి అనుగుణంగా.. వేరే నగలు చేయించుకున్నపుడు వజ్రాలను మాస్కు నుంచి వేరు చేయవచ్చు.

ఇక ప్రభుత్వ నిబంధనలను అనుసరించి అన్ని విధాలా సురక్షితమైన వస్త్రాన్నే మాస్కు తయారీలో వాడుతున్నాం. చాలా ఆర్డర్లు వస్తున్నాయి. పెళ్లిలో దుస్తులకు మ్యాచ్‌ అయ్యే మాస్కులు తయారు చేయాల్సిందిగా వధూవరులు కోరుతున్నారు’’అని చెప్పుకొచ్చారు. కాగా మహారాష్ట్రలోని పుణెకు చెందిన శంకర్ కురాడే అనే వ్య‌క్తి సుమారు 2 ల‌క్ష‌ల 89 వేల ఖ‌రీదైన గోల్డెన్ మాస్క్‌ను త‌యారు చేయించుకున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు