ఆకతాయిలకు చెక్‌ పెట్టేందుకు..

16 May, 2019 16:09 IST|Sakshi
స్రతీకాత్మక చిత్రం

అహ్మదాబాద్‌ : పుట్టిన రోజు స్నేహితులతో కలిసి రోడ్లపై రచ్చ చేసే ఆకతాయిలకు చెక్‌ పెట్టేందుకు గుజరాత్‌ పోలీసులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.వేడుకల్లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో కేకు పూయడం, ఫోమ్‌ స్ప్రే చేయడం వంటివి ఇకపై అరెస్టు చేస్తామంటూ సూరత్‌ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. బర్త్‌డే పేరిట ఒక వ్యక్తిని గాయపరచడం, తీవ్రంగా కొట్టడం, అర్ధరాత్రి రోడ్లపై సంచరించడం వంటివి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ విషయం గురించి సూరత్‌ పోలీసు కమిషనర్‌ సతీశ్‌ శర్మ మాట్లాడుతూ.. రోడ్లపై బర్త్‌డే పార్టీలు చేసుకునే క్రమంలో కొంతమంది న్యూసెన్స్‌ క్రియేట్‌ చేస్తున్నారని తమకు ఫిర్యాదు అందినట్లు పేర్కొన్నారు. అదే విధంగా ఆకతాయిల కారణంగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతున్నాయనే ఫిర్యాదులు అందాయన్నారు.

ఈ నేపథ్యంలో పాదచారుల అసౌకర్యాన్ని దూరం చేసేందుకు ఈ రకమైన ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. వీటిని ఉల్లంఘించిన వారిని సీఆర్‌పీసీ సెక్షన్‌ 144 ప్రకారం అరెస్టు చేసే వీలుంటుందని పేర్కొన్నారు. కాగా గుజరాత్‌ ప్రభుత్వం ఇప్పటికే పబ్‌జీ గేమ్‌, పబ్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇక బర్త్‌డే బంప్‌ల కారణంగా రెండు నెలల క్రితం ఐఎమ్‌ఎమ్‌ విద్యార్థి తీవ్రంగా గాయపడి తుదిశ్వాస విడిచిన ఘటన కలకలం రేపింది. బర్త్‌డే సందర్భంగా అతడు స్నేహితులకు పార్టీ ఇవ్వగా.. వేడుకలో భాగంగా వాళ్లు అతడిని చితక్కొట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆ బర్త్‌డే బాయ్‌ మరుసటి రోజు తీవ్ర కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనల నేపథ్యంలో  సూరత్‌ పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు.

మరిన్ని వార్తలు