ఆ స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్‌ తరహా సౌకర్యాలు

30 Apr, 2018 15:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే మంత్రిత్వ శాఖ చేపట్టిన స్టేషన్‌ పునఃఅభివృద్ధి కార్యక్రమం కింద సూరత్‌ రైల్వే స్టేషన్‌ను అత్యంత అధునాతన సదుపాయాలతో తీర్చిదిద్దనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోనే సర్వాంగ సుందరంగా ముస్తాబు కానున్న మూడవ స్టేషన్‌గా సూరత్‌ నిలవనుంది. గుజరాత్‌లో గాంధీనగర్‌ తర్వాత సూరత్‌ రైల్వే మంత్రిత్వ శాఖ రూ లక్ష కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఎంపికైంది. కార్యక్రమానికి కేటాయించే నిధులతో రైల్వే మంత్రిత్వ శాఖ సూరత్‌ రైల్వేస్టేషన్‌ను ఎయిర్‌పోర్ట్‌ తరహా సదుపాయాలతో అభివృద్ధి చేయనున్నారు.  

స్టేషన్‌లో మల్టీమోడల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ హబ్‌ ఏర్పాటుకు ఐఆర్‌ఎస్‌డీసీ, సూరత్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, జీఎస్‌ఆర్‌టీసీల సంయుక్త సంస్థ సిట్కో టెండర్లను ఆహ్వానించింది. రూ 5000 కోట్లతో నిర్మించే ఈ హబ్‌ 2020 నాటికి అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్ధానిక సంస్థ సంయుక్తంగా చేపడతాయని, నిర్మాణ పనులు ఈ ఏడాదిలోనే ప్రారంభమవుతాయని ఐఆర్‌ఎస్‌డీసీ ఎండీ ఎస్‌కే లోహియా చెప్పారు.

స్టేషన్‌లో విశాల ప్రాంగణంలో బస్‌ టెర్మినల్‌ ఏర్పాటు చేస్తామని 900 వాహనాలకు పార్కింగ్‌ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. రోజూ 3 లక్షల మంది ప్రయాణీకులను హ్యాండిల్‌ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. స్టేషన్‌ సమీపంలో అయిదు రోడ్డు అండర్‌బ్రిడ్జిలు నిర్మిస్తామన్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో దేశంలోని తొలి ప్రపంచశ్రేణి రైల్వే స్టేషన్లు హబీబ్‌గంజ్‌, గాంధీనగర్‌లు సేవలందించేందుకు సిద్ధమవుతాయన్నారు. 

మరిన్ని వార్తలు