‘నోటు’ దెబ్బకు ఆ‘దారం’ తెగుతోంది!

13 Dec, 2016 02:37 IST|Sakshi
‘నోటు’ దెబ్బకు ఆ‘దారం’ తెగుతోంది!

► సూరత్‌లో టెక్స్‌టైల్‌ రంగం విలవిల
► తెలంగాణ కార్మికుల అష్టకష్టాలు
► మూతపడుతున్న దుకాణాలు
►30 శాతం తగ్గిన గ్రే బట్ట ఉత్పత్తి.. కోట్లలో నష్టం
► పనుల్లేక పస్తులుంటున్న కార్మికులు


సాక్షి, ముంబై: పెద్దనోట్ల రద్దు ప్రభావంతో ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని సూరత్‌లో టెక్స్‌టైల్‌ రంగం విలవిల్లాడుతోంది. ఈ రంగంపై ఆధారపడి బతుకుబండి లాగుతున్న తెలంగాణ కార్మికులు ఉపాధికి దూరమవుతున్నారు. పలు జిల్లాల నుంచి పొట్టచేతబట్టుకుని ఇక్కడకు వచ్చిన వారంతా పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సూరత్‌లో ప్రతినిత్యం గ్రే బట్ట సుమారు 4 కోట్ల మీటర్ల మేర ఉత్పత్తి అవుతుంది. అయితే పెద్దనోట్ల రద్దు దెబ్బకు దీని ఉత్పత్తి 30 శాతం తగ్గింది. ఫలితంగా టెక్స్‌టైల్‌ రంగం కోట్లల్లో నష్టపోతోంది. అనేక మంది ఫ్యాక్టరీలను నడపలేక కార్మికులకు వారానికి రెండు నుంచి నాలుగు రోజులపాటు సెలవులు ఇస్తున్నారు. కొందరైతే కొన్నిరోజులపాటు పరిశ్రమను పూర్తిగా మూసేయాలనే ఆలోచనలో ఉన్నారు.

మనోళ్లే ఎక్కువ
సూరత్‌లోని టెక్స్‌టైల్‌ రంగంలో అత్యధికంగా తెలంగాణకు చెందినవారే ఉన్నారు. పవర్‌లూమ్స్‌ పరిశ్రమలన్నీ కుదేలవడంతో వారి పరిస్థితి దుర్భరంగా మారింది. నిత్యావసర వస్తువుల కొనుగోలుకు కూడా నానా అవస్తలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు తెలంగాణ, ఆంధ్రతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు కోసం వచ్చే బట్టల వ్యాపారులతో ఇక్కడి మార్కెట్లన్నీ కిటకిటలాడేవి. పెద్దనోట్ల రద్దు తర్వాత ఈ మార్కెట్లన్నీ బోసిపోయి కన్పిస్తున్నాయి. అనేక మంది తమ దుకాణాలను మూసివేసుకుని కూర్చుంటున్నారు.

ఇలాగైతే ఫ్యాక్టరీ మూసివేయాల్సిందే..
నోట్ల రద్దుతో మార్కెట్లోని 30 శాతం దుకాణాలు మూతబడ్డాయి. బట్టలు కొనేందుకు ఎవరు రావడంలేదు. ఇప్పటికే కార్మికులకు జీతాలు ఇవ్వలేకున్నాం. తాత్కాలికంగా మా ఫ్యాక్టరీని మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
– రుద్ర శ్రీనివాస్, పవర్‌లూమ్స్‌ యజమాని,  గుమ్మడవెల్లి, సూర్యాపేట జిల్లా

జీతాలకే కష్టమైంది..
మార్కెట్లన్నీ బోసిపోతున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి వ్యాపారులు రావడం తగ్గింది. కార్మికుల జీతాలు ఇవ్వడమే కష్టతరం గా మారింది. మార్కెట్లలో లావాదేవీలన్ని నిలిచిపోయాయి.
– ఎనగందుల శ్రీధర్, గణేష్‌ సిల్క్‌ మిల్‌ షాపు యజమాని,తూర్పుగూడెం, సూర్యాపేట

పనుల్లేవు..
పెద్ద నోట్ల రద్దు తర్వాత పనులు సరిగ్గా లభించడం లేదు. మా యజమాని ఫ్యాక్టరీకి రెండు రోజులు సెలవులు ప్రకటించాడు. పనుల్లేక పస్తులుంటున్నాం. – సిలివేరి నాగేష్, పవర్‌లూమ్స్‌ కార్మికుడు, కుక్కడం, సూర్యాపేట

అంచనాలన్నీ తారుమారయ్యాయి..
నాలుగు నెలలకిందటే సొంతంగా ఫ్యాక్టరీ పెట్టా. పది మంది వర్కర్లున్న నా ఫ్యాక్టరీకి దీపావళి వరకు మంచి ఆర్డర్లు ఉండేవి. ఇప్పుడు అంచనాలన్నీ తారుమారయ్యాయి. ఇలా పనులు లభించక ఇబ్బందులు పడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు.     –చిట్యాల నరేశ్, టెక్స్‌టైల్‌ డిజిటల్‌ ప్రింటింగ్‌ యజమాని, నర్సింహులపేట, మహబూబాబాద్‌

మరిన్ని వార్తలు