ప్చ్‌...సూపర్‌ రిచ్‌!

6 Jul, 2019 04:52 IST|Sakshi

కోటీశ్వరులపై సర్‌చార్జీలు పెంచుతూ నిర్ణయం

దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ధనవంతులు మరింత పన్ను చెల్లించడానికి సిద్ధం కావాలంటూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కోటీశ్వరులు చెల్లించే ఆదాయ పన్నుపై సర్‌చార్జీలను భారీగా పెంచేశారు. సర్‌చార్జీల పెంపువల్ల రూ.2–5 కోట్ల ఆదాయం ఉన్న వారిపై నికరంగా 3%, రూ.5 కోట్లు ఆదాయం దాటినవారిపై 7% వరకు అదనపు భారం పడుతుంది. ఈ సర్‌చార్జీల పెంపుతో రూ.5 కోట్లు ఆదాయం దాటిన వారు నికరంగా 42.74% పన్ను చెల్లించాల్సి రానుంది.

ఇది అగ్ర రాజ్యం అమెరికాలోని వ్యక్తిగత ఆదాయ పన్ను రేటు కంటే అధికం. అమెరికాలో గరిష్టంగా ఆదాయ పన్ను రేటు 40 శాతంగా ఉంది. ఇప్పుడు ఆ రికార్డును సీతారమన్‌ బద్ధలు కొట్టారు. సంపన్నులపై సర్‌చార్జీలను పెంచడం ద్వారా రూ.12,000 కోట్ల అదనపు ఆదాయం రానుంది. ఇదే సమయంలో రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్న వారు ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదని ఆమె పేర్కొన్నారు. నిజానికి ఈ వెసులుబాటు గత ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లోనే కల్పించారు. ఆదాయ పన్ను శ్లాబుల్లో ఎటువంటి మార్పులు చేయకుండా సెక్షన్‌ 87 కింద లభించే రిబేటును రూ.3.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు వరకు అప్పట్లోనే పెంచారు. దీనివల్ల రూ.5 లక్షల లోపు ఆదాయం వున్న వారు చెల్లించాల్సిన పన్నుపై రిబేటు లభిస్తుంది.

సంపన్నులపై భారం ఇలా పెరిగింది..
ప్రస్తుతం పన్ను పరిధిలోకి వచ్చే వార్షికాదాయం రూ.10 లక్షల దాటితే 30% గరిష్ట పన్ను విధిస్తున్నారు. ఇది కాకుండా రూ.50 లక్షలు ఆదాయం దాటిన వారిపై రెండు రకాల సర్‌చార్జీలను విధిస్తున్నారు. రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల లోపు ఆదాయం ఉన్న వారిపై 10 శాతం, రూ. కోటి దాటితే 15% సర్‌ చార్జి విధిస్తున్నారు. దీనిపై 4% సుంకం అదనం. ఇప్పుడు రూ.2 కోట్ల నుంచి 5 కోట్ల లోపు ఉన్నవారిపై సర్‌ చార్జీని 15 శాతం నుంచి 25 శాతానికి, అదే రూ.5 కోట్లు దాటితే 15 శాతం నుంచి 37 శాతానికి పెంచుతూ బడ్జెట్‌లో ప్రతిపాదన చేశారు. దీంతో రూ.2–5 కోట్ల లోపు ఆదాయం ఉన్న వారు చెల్లించే నికర పన్ను రేటు (శ్లాబ్‌ రేటు+ సర్‌చార్జీ+ సుంకం) 35.88 శాతం నుంచి 39 శాతానికి పెరిగింది. అదే విధంగా రూ.5 కోట్ల ఆదాయం దాటిన వారి పన్ను భారం 42.74 శాతానికి చేరింది.

గృహరుణంపై మరింత మినహాయింపు
అందరికీ ఇళ్లు అన్న లక్ష్యాన్ని తొందరగా చేరుకోవడానికి అందుబాటు ధరల్లోని గృహాలపై పన్ను మినహాయింపు పరిమితిని పెంచుతూ బడ్జెట్‌లో నిర్ణయించారు. ప్రస్తుతం గృహరుణాలపై చెల్లించే వడ్డీపై రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు లభించేది. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.3.5 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. కానీ ఇంటి విలువ రూ.45 లక్షలలోపు ఉంటేనే ఈ పెంపు వర్తిస్తుంది. అలాగే మార్చి 31, 2020లోగా కొనుగోలు చేసిన ఇళ్లకు మాత్రమే ఈ మినహాయింపు లభిస్తుంది. 15 ఏళ్ల కాలానికి రుణం తీసుకుంటే వడ్డీ మినహాయింపు పరిమితిని అదనంగా రూ.1.5 లక్షలకు పెంచడం వల్ల సుమారుగా రూ.7 లక్షల వరకు ప్రయోజనం చేకూరనుందని సీతారామన్‌ పేర్కొన్నారు.  

పన్ను పరిధిలోకి మరింత మంది
పన్ను పరిధిలోకి తీసుకువచ్చేందుకు బడ్జెట్‌లో పలు నిర్ణయాలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఏడాదికి రూ.50 లక్షలు దాటి చెల్లింపులు చేసే వారితో పాటు కాంట్రాక్టర్లు, వృత్తినిపుణులపై 5% టీడీఎస్‌ను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే కరెంట్‌ అకౌంట్‌ ఖాతాలో రూ. కోటికి మించి డిపాజిట్‌ చేస్తే, రూ. లక్ష మించి విద్యుత్‌ బిల్లు చెల్లిస్తే, అదే విధంగా ఏడాదిలో విదేశీ పర్యటనల రూపంలో రూ.2 లక్షలు ఖర్చు చేస్తే రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.

ట్యాక్స్‌ శ్లాబులు
ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయ పన్ను శ్లాబుల్లో ఈసారి బడ్జెట్‌ సందర్భంగా ఎలాంటి మార్పులూ చేయలేదు. అయితే శ్లాబులేవీ లెక్కించకుండా రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారికి ఎటువంటి పన్ను భారం లేకుండా గత ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లోనే నిర్ణయం తీసుకున్నారు. సెక్షన్‌ 87 రిబేటు పరిమితిని నాటి బడ్జెట్‌ సందర్భంగా రూ.3,50,000 నుంచి రూ.5,00,000కు పెంచారు. దీంతో రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు చెల్లించాల్సిన పన్నుపై రిబేటు లభించడం ద్వారా ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈసారి బడ్జెట్‌లో మాత్రం వార్షికాదాయం రూ.2 కోట్లు దాటిన వారిపై మాత్రం అదనపు సర్‌ఛార్జీ విధిస్తున్నట్లు ప్రకటించారు.

మరిన్ని వార్తలు