లాక్‌డౌన్‌: కేంద్రం వివాదాస్పద ప్రకటన

21 Apr, 2020 16:16 IST|Sakshi

న్యూఢిల్లీ: గోదాముల్లో అవసరానికి మించి ఉన్న బియ్యాన్ని ఇథనాల్‌గా మార్చి, శానిటైజర్ల తయారీకి, కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు పెట్రోల్‌లో కలిపేందుకు ఉపయోగిస్తామని కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. జీవ ఇంధనాలపై జాతీయ విధానంలో భాగంగా.. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అధ్యక్షతన జరిగిన ‘నేషనల్‌ బయో ఫ్యూయల్‌ కోఆర్డినేషన్‌’ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా లక్షలాదిగా వలస కూలీలు, ఇతర పేదలు ఆకలితో బాధపడుతున్న తరుణంలో కేంద్రం చేసిన ఈ ప్రకటన వివాదాస్పదమైంది. లాక్‌డౌన్‌ సమయంలో.. దేశంలోని 80 కోట్ల మంది పేదలకు రానున్న మూడు నెలల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం గతంలో చెప్పింది. అధికారిక సమాచారం ప్రకారం ఎఫ్‌సీఐ గోడౌన్లలో 58.49 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయి. ఇందులో 30.97 మిలియన్‌ టన్నుల బియ్యం, 27.52 మిలియన్‌ టన్నుల గోధుమలు ఉన్నాయి. నిర్దేశించిన ఆహార నిల్వల కంటే ఏప్రిల్‌ 1 నాటికి 21 మిలియన్ టన్నులు ఎక్కువగా ఉన్నాయి.

కాగా, ఇథనాల్‌తో హాండ్‌ శానిటైజర్ల తయారీకి ఇటీవల కేంద్ర ప్రభుత్వ షూగర్‌ కంపెనీలు, డిస్టిలరీస్‌కు అనుమతి ఇచ్చింది. సాధారణంగా పెట్రోల్‌లో కలిపేందుకు ఇథనాల్‌ను చమురు సంస్థలకు షూగర్‌ కంపెనీలు సరఫరా చేస్తుంటాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున శానిటైజర్లు తయారుచేసి ఆస్పత్రులు, సంస్థలకు సరఫరా చేయాలని నిర్ణయించినట్టు షూగర్‌ కంపెనీల సంఘం(ఐఎస్‌ఎంఏ) వెల్లడించింది. వీటిని తయారు చేసిన ధరకు లేదా ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించింది.

చదవండి: కరోనాపై అంతుచిక్కని అంశాలు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు