నిఘా నిద్రపోతోందా..?

12 Dec, 2016 15:13 IST|Sakshi
నిఘా నిద్రపోతోందా..?

- వరుస ఉగ్ర దాడులు జరుగుతున్నా మేల్కోని రక్షణ వర్గాలు
- భద్రతా లోపాలే కొంపముంచుతున్నాయంటున్న నిపుణులు
 
 న్యూఢిల్లీ: మొన్న పఠాన్‌కోట్.. నిన్న ఉడీ.. నేడు నగ్రోటా..! ఒకే ఏడాదిలో ఒకదాని వెంట ఒకటి ఉగ్రదాడులు!! ఎంత అప్రమత్తంగా ఉన్నా ముష్కర మూకలు ఎలా దాడులకు తెగబడుతున్నాయి? ఏకంగా పోలీసు దుస్తుల్లోనే వచ్చి రక్తపుటేర్లు ఎలా పారిస్తున్నాయి? ఇప్పుడు రక్షణ వర్గాలను, ఆ రంగ నిపుణుల మదిని తొలుస్తున్న ప్రశ్నలివి. ఉగ్రవాదుల ఈ వరుస దాడులు భద్రతాపరమైన లోపాలను తేటతెల్లం చేస్తున్నాయని పలువురు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆర్మీ యూనిట్లు, శిబిరాలపై దాడులు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టడంలో రక్షణ శాఖతోపాటు భద్రతా బలగాలు విఫలమవుతున్నాయని వారు పేర్కొంటున్నారు. చొరబాట్లను కట్టుదిట్టంగా నియంత్రించడంతోపాటు యూనిట్లకు కాపలాగా ఉండే సెంట్రీ వ్యవస్థనూ ఆధునీకరించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. పఠాన్‌కోట్‌లో ఏడుగురు, సెప్టెంబర్‌లో ఉడీ దాడిలో 19 మంది సైనికులు అమరులయ్యారు. ఇవి మరవకముందే తాజాగా నగ్రోటాలో ముష్కరులు మరోసారి దాడికి తెగబడి ఇద్దరు అధికారులతోపాటు ఏడుగురు జవాన్లను బలిగొన్న సంగతి తెలిసిందే.

 ఆ సిఫారసుల అమలు ఏది?
 జనవరి 2న పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో ఉగ్ర దాడి తర్వాత కేంద్రం ఒక కమిటీ నియమించింది. భద్రతాపరమైన లోపాలపై ఈ కమిటీ పలు సిఫారసులు చేసింది. అయితే అవి ఇప్పటికీ పూర్తిస్థారుులో అమలుకావడం లేదు. మాజీ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫిలిప్ కాంపోజ్ గత మేలో రక్షణమంత్రికి నివేదిక సమర్పించారు. అయినా భద్రతా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన మెరుగుపరచడం లేదు. ఇది మరిన్ని దాడులకు ఆస్కారమిస్తోంది.

 బలగాలపై ఒత్తిడి ఉందా?
 రక్షణ బలగాల్లో దీర్ఘకాలంగా ఒత్తిడి ఉంటోందని, దీనివల్ల వారు పూర్తిస్థారుులో భద్రత కల్పించేందుకు అవకాశం ఉండట్లేదని రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ముష్కర మూకలకు కళ్లెం వేయాలంటే వైఫల్యాలను తక్షణమే అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.
 
 పర్యవేక్షక వ్యవస్థపై సందేహాలు
 నగ్రోటా దాడి ఆపరేషన్‌కు వారం క్రితమే ముష్కరులు పక్కా రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. ‘‘ఆర్మీ యూనిట్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు ధరించిన పోలీసు దుస్తులను భారత్‌లోనే కుట్టించారు. ఇది ఒక రోజులో జరిగే పని ఎంతమాత్రం కాదు. దీన్నిబట్టి చూస్తే ఉగ్రవాదులు ఇక్కడే కొంతకాలం మకాం పెట్టినట్లు తెలుస్తోంది’’ అని రక్షణ శాఖ అధికారి ఒకరు చెప్పారు. ఇదే నిజమైతే మన ఇంటెలిజెన్‌‌స, పర్యవేక్షక వ్యవస్థపై కొన్ని సందేహాలు కలగకపోవన్నారు. ఉగ్రవాదులు ఇక్కడ తిష్ట వేస్తే వారి అనుపానులు గుర్తిస్తూ ఇంటెలిజెన్‌‌స ఎప్పటికప్పుడు బలగాలను అప్రమత్తం చేయాలి. కానీ ఇక్కడ అదేదీ జరగలేదని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు