మోదీ ఏడాది పాలనపై 62 శాతం మంది సంతృప్తి!

28 May, 2020 21:00 IST|Sakshi

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో ప్రధానిగా నరేంద్ర మోదీ సఫలం అయ్యారా? కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం విజయవంతమైందా? మోదీ 2.0 ఏడాది పాలన మీ అంచనాలను అందుకుందా? అంటే 62 శాతం మంది పౌరులు అవుననే అంటున్నారట. దాదాపు 65 వేల మంది నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ మేరకు ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించినట్లు లోకల్‌ సర్కిల్స్‌ అనే సంస్థ పేర్కొంది. వీరిలో 59 శాతం మంది ప్రజలు మహమ్మారిని కట్టడి చేయడంలో మోదీ చాలా బాగా పనిచేశారని పేర్కొనగా.. 31 శాతం మంది పర్లేదని అభిప్రాయపడినట్లు వెల్లడించింది. అయితే లాక్‌డౌన్‌ మూడో దశ(మే 14)నాటికి అంటే లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపునకు ముందు వరకు సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ గణాంకాలు వెల్లడించినట్లు తెలిపింది.(భారత్‌కు ‘స్వావలంబన’తోనే మోక్షం!)

ఇదిలా ఉండగా.. రోజురోజుకీ దేశంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ పార్టీ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ విఫలమైందని ఆ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించగా.. వలస కార్మికులను ఆదుకోవడంలో మోదీ సర్కారు వైఫల్యం చెందిందని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మండిపడ్డారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన సర్వేలో 76 శాతం మంది ప్రజలు మోదీ పాలనలో సంతోషంగా లేరని పర్కొంది. అదే విధంగా కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో కేంద్రం విఫలమైనట్లు మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారని వెల్లడించింది. మరోవైపు మోదీ సర్కారు 2.0 అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తైన సందర్భంగా.. ప్రభుత్వం సాధించిన విజయాలను తెలుపుతూ వర్చువల్‌ ర్యాలీలు నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది.(లాక్‌డౌన్‌ 5.0 : ఆ నగరాలపై ఫోకస్‌)

లోకల్‌ సర్కిల్స్‌ సర్వే వివరాలిలా..
మోదీ ప్రభుత్వ (2.0) తొలి ఏడాది పాలన బాగుంది: 62 శాతం
మా అంచనాలను మించి మెరుగైన పాలన: 26 శాతం
మా అంచనాలు అందుకుంది: 36 శాతం
ఈ విభాగంలో మొత్తం పోలైన ఓట్లు: 8,140
నిరుద్యోగం విషయంలో  ఏడాది కాలంగా పరిస్థితి ఎలా ఉంది?
పర్లేదు: 29 శాతం
అసలేం పట్టించుకోవడం లేదు: 56 శాతం
చెప్పలేం: 15 శాతం
ఏడాది కాలంగా వ్యాపార కార్యకలాపాల నిర్వహణ మరింత తేలికైనట్లు భావిస్తున్నారా?
అవును: 43 శాతం
కాదు: 33 శాతం
చెప్పలేం: 24 శాతం
ప్రపంచ దేశాల్లో భారత్‌ ఇమేజ్‌ పెరిగిందా?
అవును: 79 శాతం
కాదు: 15 శాతం
చెప్పలేం: 6 శాతం
కోవిడ్‌ మహమ్మారిని భారత్‌ ఎలా ఎదుర్కొంటోంది?
చాలా బాగా ఎదుర్కొంటోంది: 59 శాతం
పర్లేదు: 31 శాతం
అంత గొప్పగా ఏమీలేదు: 7 శాతం
అస్సలేమీ బాగాలేదు: 3 శాతం
గతేడాది కాలంగా అవినీతి తగ్గిందనుకుంటున్నారా?
అవును: 49 శాతం
కాదు: 43 శాతం
చెప్పలేం: 8 శాతం
పన్ను అధికారుల వేధింపులు తక్కువయ్యాయని భావిస్తున్నారా?
అవును: 52 శాతం
కాదు: 22 శాతం
చెప్పలేం: 26 శాతం
కమ్యూనలిజంకు సంబంధించిన వివాదాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తోందా?
అవును: 56 శాతం
కాదు: 40 శాతం
చెప్పలేం: 4 శాతం
స్టార్టప్‌ల స్థాపన సులువుగా మారిందా?
అవును: 37 శాతం
కాదు: 31 శాతం
చెప్పలేం: 32 శాతం
పార్లమెంటులో బిల్లులు నెగ్గించుకోవడం సహా సభపై పట్టుసాధించే సామర్థ్యం మెరుగైందా?
అవును: 79 శాతం
కాదు: 19 శాతం
చెప్పలేం: 6 శాతం
ఇలా దాదాపు 15 కేటగిరీల్లో మెజారిటీ ప్రజలు మోదీ సర్కారుకు అనుకూలంగానే ఓటు వేశారు.

మరిన్ని వార్తలు