ఆ నగరానికి ఏమైంది..?

3 Nov, 2019 18:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్ధాయికి చేరడంతో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంత వాసుల్లో 40 శాతం మంది ఇతర నగరాలకు తరలిపోవాలని భావిస్తున్నట్టు తాజా అథ్యయనం స్పష్టం చేసింది. కాలుష్యం కోరలు చాస్తున్నా తమకు మరో మార్గం లేదని, ఇక్కడే సర్ధుకుపోవాలని 13 శాతం మంది వెల్లడించారు. 17,000 మందికి పైగా రాజధాని వాసులను ఈ సర్వే పలుకరించగా 40 శాతం మంది కాలుష్య తీవ్రతతో విసిగిపోయామని, పలు వ్యాధులు తమను చుట్టుముడుతున్నాయని తేల్చిచెప్పారు. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం నుంచి వేరొక నగరానికి వెళ్లే దిశగా యోచిస్తున్నామని వారు చెప్పుకొచ్చారు.

కాలుష్యం కారణంగా ఢిల్లీని విడిచివెడతామని 2018లో పేర్కొన్న వారితో పోలిస్తే తాజా సర్వేలో ఈ దిశగా అభిప్రాయపడిన వారు 14 శాతం అధికం కావడం గమనార్హం. మరోవైపు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు మాస్క్‌లు ధరించడంతో పాటు ఎయిర్‌ ఫ్యూరిఫైర్లను వాడటం వంటి జాగ్రత్తలతో ఈ ప్రాంతంలోనే ఉంటామని 31 శాతం మంది వెల్లడించినట్టు ఆన్‌లైన్‌ వేదిక లోకల్‌సర్కిల్స్‌ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇక తాము ఢిల్లీలోనే కొనసాగినా కాలుష్య తీవ్రత ప్రబలిన సమయంలో వేరొక ప్రాంతానికి పర్యటనకు వెళతామని 16 శాతం మంది చెప్పగా 13 శాతం మంది మాత్రం కాలుష్యంతో సహజీవనం చేయడం​ మినహా తమకు వేరే మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా కాలుష్యం తీవ్రతరం కావడంతో తాము రోజూ ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైందని 13 శాతం మంది చెప్పారు. తాము ఇప్పటికే వైద్యులను సంప్రదించామని 29 శాతం మంది పేర్కొన్నారు. కాలుష్యం కారణంగా తాము అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నామని 44 శాతం మంది చెప్పారు.

మరిన్ని వార్తలు