డిప్యూటీ సీఎం కుటుంబాన్ని రక్షించిన ఎన్డీఆర్‌ఎఫ్‌

30 Sep, 2019 16:08 IST|Sakshi

పట్నా : బిహార్‌ను భారీ వర్షాలు అతలకుతలం చేస్తున్నాయి.  రాజధాని పట్నాలో వర్షాల కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. చాలా ప్రాంతాల్లోకి నీరు చేరడంతో రోడ్లన్నీ చెరవులను తలపిస్తున్నాయి.  అయితే ఈ వరదల్లో సామాన్య ప్రజలే కాదు... రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ మోదీ కూడా చిక్కుకున్నారు. పట్నాలోని ఆయన నివాసం ఉన్న రాజేంద్ర నగర్‌ ప్రాంతంలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. మూడు రోజులుగా మోదీతో పాటు ఆయన కుటుంబసభ్యులు అక్కడే ఉండిపోయారు. 

దీంతో సోమవారం రోజున ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు మోదీతో పాటు ఆయన కుటుంబ సభ్యులను సురక్షిత ప్రాంతానికి చేర్చారు. దీంతో మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. అయితే మోదీ మాత్రం మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. మరోవైపు పట్నాలో జనజీవనం స్తంభించింది. బిహార్‌ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు కేంద్రం రెండు హెలికాప్టర్లను బిహార్‌కు పంపించింది. బిహార్‌లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికారులు అక్టోబర్‌ 1 వరకు స్కూళ్లకు సెలవు ప్రకటించారు.

>
మరిన్ని వార్తలు