చర్చలే మార్గం.. యుద్ధం కాదు!

17 Dec, 2015 01:48 IST|Sakshi
చర్చలే మార్గం.. యుద్ధం కాదు!

పాక్‌తో సంబంధాలపై లోక్‌సభలో సుష్మా స్వరాజ్
 
 న్యూఢిల్లీ: ఉగ్రవాద నీడలు తొలగించేందుకు పాకిస్తాన్‌తో చర్చలే ఏకైక మార్గమని భారత్ స్పష్టం చేసింది. పాకిస్తాన్‌తో యుద్ధం చేయాలన్న ఆలోచన లేదని పేర్కొంది. ఉగ్రవాదంపై చర్చలు జరపాలన్నది భారత్, పాక్‌ల ప్రధానులు మోదీ, షరీఫ్‌లు రష్యాలోని ఉఫాలో, ఇటీవల పారిస్‌లో కలుసుకున్న సందర్భంలో తీసుకున్న నిర్ణయమని విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ గుర్తు చేశారు. ‘బ్యాంకాక్‌లో జాతీయ భద్రత సలహాదారుల భేటీలో ఉగ్రవాదంపై చర్చించాం. ఒక్కసారి చర్చిస్తే సరిపోదు. చర్చల ప్రక్రియను కొనసాగించాలని నిర్ణయించా’మన్నారు. లోక్‌సభలో బుధవారం జీరో అవర్‌లో సుష్మా ఈ విషయమై మాట్లాడారు. 

లాడెన్‌ను తుదముట్టించేందుకు పాక్‌లో అమెరికా చేపట్టిన సైనిక చర్య తరహా ప్రయత్నాల గురించి భారత్ ఆలోచిస్తోందా? అన్న బీజేపీ సభ్యుడు గణేశ్ అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ.. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై చర్యలు తీసుకునే విషయమై పాక్‌తో చర్చిస్తున్నామన్నారు. తన తాజా పర్యటన సందర్భంగా.. ఉగ్రవాదానికి సంబంధించి అన్ని అంశాలపై ఎన్‌ఎస్‌ఏ స్థాయి చర్చలు జరపాలని ఇరుదేశాలు నిర్ణయించాయన్నారు.  సీమాంతర ఉగ్రవాదాన్ని ఐరాస, ఈయూ సహా దాదాపు అన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించామని చెప్పారు. ఐరాసలో పెండింగ్‌లో ఉన్న ‘అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందం’లో కదలిక తెచ్చేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారన్నారు.

 రామేశ్వరం నుంచి శ్రీలంకకు వారధి
 భారత్‌లోని రామేశ్వరం నుంచి శ్రీలంకకు సముద్రం మీదుగా వారధిని, సొరంగాన్ని నిర్మించనున్నామని కేంద్ర రవాణా, రహదారుల మంత్రి గడ్కరీ బుధవారం పార్లమెంటుకు తెలిపారు. నిర్మాణానికి 100% నిధులను అందించేందుకు ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ సిద్ధంగా ఉందన్నారు. ప్రాజెక్టు వ్యయం రూ. 24 వేల కోట్లుగా ఉంటుందన్నారు. దేశాల మధ్య వాహనాలు నిరంతరాయంగా తిరిగేలా బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్‌లతో భారత్ ఒప్పందం కుదుర్చుకుందన్నారు.

► పారిస్ వాతావరణ ఒప్పందంలో భారత ప్రయోజనాలకు సముచిత ప్రాధాన్యత లభించిందని కేంద్ర పర్యావరణ మంత్రి జవదేకర్ పేర్కొన్నారు. భారత ప్రధాన డిమాండ్లకు ఆమోదం లభించిందన్నారు. వాతావరణ సదస్సులో భారత్ పోషించిన పాత్రను పార్లమెంటు ఉభయసభలకు జవదేకర్ వివరించారు.
► {పభుత్వ సంస్థల్లో అవినీతిని, అవకతవకలను వెలికితీస్తున్న విజిల్ బ్లోయర్స్, సమాచార హక్కు కార్యకర్తలు ఎంతమంది హతమయ్యారో తెలిపే కేంద్రీకృత సమాచారం తమవద్ద లేదని ప్రభుత్వం తెలిపింది.
► సొంత ప్రాంతాల అభివృద్ధి కోసం పార్లమెంటు సభ్యులకిచ్చే మొత్తాన్ని ఏడాదికి రూ. 5 కోట్ల నుంచి రూ. 25 కోట్లకు పెంచాలని పలువురు ఎంపీలు డిమాండ్ చేశారు. ప్రస్తుతమిస్తున్న ఎంపీల్యాడ్స్ నిధులు సరిపోవడం లేదన్నారు.
► అత్యంత విలువైన వాణిజ్యపరమైన వ్యాజ్యాల విచారణకు ప్రత్యేకంగా కొన్ని ఎంపిక చేసిన హైకోర్టుల్లో ‘కమర్షియల్ బెంచ్’లను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.
► చంద్రయాన్ 2’లో భాగంగా భారతీయ రాకెట్ 2017లో చంద్రుడిపై దిగుతుందని ప్రధాని కార్యాలయ సహాయమంత్రి జితేంద్రసింగ్ లోక్‌సభకు తెలిపారు. దేశ తొలి సోలార్ మిషన్ ‘ఆదిత్య ఎల్1’ 2019లో ప్రారంభమవుతుందన్నారు.

మరిన్ని వార్తలు