సుష్మ తొలి జయంతి: మా జీవితాల్లోని సంతోషం!

14 Feb, 2020 09:21 IST|Sakshi

ఒక్క ట్వీట్‌తో ఎంతో మంది సమస్యలను తీర్చి.. భారత ప్రజల చేత ‘‘సూపర్‌ మామ్‌’’ అనిపించుకున్న సుష్మా స్వరాజ్‌ మొదటి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆమెను గుర్తు చేసుకుంటూ పలువురు నెటిజన్లు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో సుష్మా స్వరాజ్‌ భర్త కౌశల్‌ స్వరాజ్‌ ట్విటర్‌ అకౌంట్‌లో వారి కుమార్తె  బన్సూరీ స్వరాజ్‌ షేర్‌ చేసిన ఫొటో.. అభిమానులకు సుష్మ నిండైన రూపాన్ని ఙ్ఞప్తికి తెస్తోంది. ‘‘హ్యాపీ బర్త్‌డే! మా జీవితాల్లోని సంతోషం సుష్మాస్వరాజ్‌’’ అంటూ కుటుంబ సభ్యులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేకు కట్‌ చేసేందుకు చేతిలో నైఫ్‌ పట్టుకుని చిరునవ్వు చిందిస్తున్న‘చిన్నమ్మ’  రూపం చూసి.. ‘‘ సూపర్‌ మామ్‌.. మీరెప్పుడూ మా హృదయాల్లో సజీవంగానే ఉంటారు’’ అంటూ నెటిజన్లు భావోద్వేగపూరిత ట్వీట్లు చేస్తున్నారు.

కాగా సుష్మాస్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ ప్రముఖ న్యాయవాది అన్న విషయం తెలిసిందే. వీరిది ప్రేమ వివాహం. సనాతన హరియాణ కుటుంబానికి చెందిన సుష్మా స్వరాజ్‌ ఎన్నో అడ్డంకులను అధిగమించి.. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి స్వరాజ్‌ కౌశల్‌ని వివాహం చేసుకున్నారు. దేశంలో ఎమర్జెన్సీ అమలులోకి వచ్చిన తొలినాళ్లలోనే 1975 జూలై 13న వీరి వివాహం జరిగింది. ఎమర్జెన్సీ సమయంలో జైలుపాలైన సోషలిస్టు నాయకుడు జార్జి ఫెర్నాండెజ్ తరఫున వాదిస్తున్నప్పుడే సుష్మ, స్వరాజ్ కౌశల్ దగ్గరయ్యారు. 44 ఏళ్ల వివాహ బంధంలో స్వరాజ్‌ కౌశల్‌, ప్రతి విషయంలో సుష్మకు వెన్నుదన్నుగా ఉన్నారు. 

కాగా ప్రేమికుల దినోత్సం రోజున జన్మించిన సుష్మా స్వరాజ్‌.. మొదటి జయంతి సందర్భంగా ఆమె భర్త కౌశల్‌ తన భార్యకు శుభాకాంక్షలు తెలుపుతూ శుక్రవారం చేసిన ట్వీట్‌ ప్రతి ఒక్కరినీ ఉద్వేగానికి గురిచేస్తోంది. ఇక గతేడాది ఆగస్టు 6న.. భారత విదేశాంగ మంత్రిగా పనిచేసిన సుష్మా స్వరాజ్‌ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె.. జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ చివరిసారిగా ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు