భారతీయులెవరూ లేరా; సుష్మా భీష్మ ప్రతిఙ్ఞ!

7 Aug, 2019 09:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నుదుటిన నిండైన బొట్టు... సాంప్రదాయక చీరకట్టు... చట్టసభల్లో తనదైన శైలిలో ప్రసంగించే తీరుతో కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా అందరి మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు సుష్మా స్వరాజ్‌. తెలంగాణ ఆకాంక్షను బలంగా వినిపించి అక్కడి ప్రజల చేత చిన్నమ్మగా.. సమస్యల్లో చిక్కుకున్న ఎంతోమందిని రక్షించిన విదేశాంగ మంత్రిగా యావత్‌ భరతావని చేత ‘సూపర్‌ మామ్‌’ అనిపించుకున్న ఆమె మంగళవారం రాత్రి కన్నుమూశారు.

సుష్మ హఠాన్మరణంతో దేశమంతా కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. తన జీవితకాలంలో (67)... దాదాపు నాలుగున్నర దశాబ్దాలు ఆమె ప్రజా జీవితంలోనే గడిపిన సుష్మా స్వరాజ్.. చివరి శ్వాస వరకు ప్రజలతో మమేకమయ్యే ఉన్నారు. ‘ఈరోజు నా కోసం జీవితమంతా ఎదురు చూశా’ అంటూ కశ్మీర్‌ పరిణామాలపై మంగళవారం చివరిసారిగా సుష్మ ట్వీట్‌ చేశారు. అదే విధంగా తన చిరకాల ఆకాంక్షను నెరవేర్చారంటూ ప్రధాని నరేంద్ర మోదీకి, రాజ్యసభలో అద్భుతంగా ప్రసంగించారంటూ కేంద్ర మంత్రి అమిత్‌ షాకు సుష్మ అభినందనలు తెలిపారు.

భీష్మ ప్రతిఙ్ఞ!
‘సుష్మా చాలా ఎమోషనల్‌ లీడర్‌. అందరికీ అతివేగంగా కనెక్ట్‌ అయిపోతారు’’ ఈ మాటలు సుష్మా స్వరాజ్‌ సన్నిహితులకే కాదు ఆమె జీవితం గురించి తెలిసిన, ట్విటర్‌లో ఆమెను ఫాలో అయ్యే యువతరానికి కూడా బాగా తెలుసు. మంచైనా, చెడు అయినా సరే మొహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని కుండబద్దలు గొట్టినట్లు చెప్పడం సుష్మకు అలవాటు. అలాగే భావోద్వేగాలను దాచుకోకుండా మాటల తూటాలు వదలడంలోనూ ఆమె ముందుంటారు. మాతృభూమి పట్ల తనకున్న భక్తిని చాటుకోవడంలోనూ ఏమాత్రం సందేహించరు. ప్రతీ విషయాన్ని చాలా వ్యక్తిగతంగా తీసుకుంటారామె.

ఉదాహరణకు... 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచి, ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి సిద్ధమవుతున్న సమయంలో సుష్మ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ‘ తమ ప్రాణాలను త్యాగం చేసి బ్రిటీష్‌ పాలనకు చరమగీతం పాడిన తర్వాత కూడా దేశాన్ని పాలించడానికి భారతీయులెవరూ దొరకలేదా? పరాయి పాలన అంతమైన తర్వాత కూడా ఓ విదేశీయురాలు పాలకురాలిగా ఎంపిక కాబడితే నిజంగా నా మనోభావాలు పూర్తిగా దెబ్బతింటాయి. ఒకవేళ అదే గనుక జరిగితే నేను శిరోముండనం చేసుకుంటాను. రోజూ నేలమీదే పడుకుంటాను. పల్లీలు మాత్రమే తింటాను. తెల్లచీరే ధరిస్తాను అంటూ యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ ప్రధాని కానున్నాన్నరన్న వార్తలపై సుష్మ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తినప్పటికీ ఆమె వెనక్కితగ్గలేదు. క్షమాపణ చెప్పేది లేదని.. సోనియా గాంధీ ఎప్పుడు ప్రధాని అయినా తాను అన్న మాటకు కట్టుబడి ఉంటానని ఘంటాపథంగా చెప్పారు.

ఇక 1996 లోక్‌సభ ఎన్నికల్లోనూ బళ్లారి(కర్ణాటక) నియోజకవర్గంలో సోనియా చేతిలో ఓటమి పాలైనపుడు కూడా సుష్మ ఈవిధంగానే స్పందించారు. తాను ఎన్నికల బరిలో ఓడిపోయానే తప్ప యుద్ధంలో కాదని ఓటమిని హుందాగా స్వీకరించిన చిన్నమ్మ.. చివరిదాకా బళ్లారి ప్రజలు, నేతలతో తరచుగా సమావేశమయ్యేవారు. ఇలా ప్రతీ విషయంలోనూ నిక్కచ్చిగా, ఒకింత ఉద్వేగంగా స్పందించే సుష్మ అకాల మరణం పట్ల ఆమె అభిమానులే కాకుండా యావత్‌ దేశమంతా ‘అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలి’ అంటూ అంతే భావోద్వేగంగా నివాళులు అర్పిస్తున్నారు.

మరిన్ని వార్తలు