సుష్మకు కన్నీటి వీడ్కోలు

8 Aug, 2019 01:30 IST|Sakshi

 లోధి రోడ్డులోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి

  భౌతిక కాయానికి రాష్ట్రపతి, ప్రధాని నివాళులు

  కన్నీరు పెట్టుకున్న ప్రధాని

  అంత్యక్రియలకు హాజరైన వేలాది మంది

  ప్రభుత్వ లాంఛనాలతో ఢిల్లీలోతుది వీడ్కోలు 

న్యూఢిల్లీ : సహచరులు, మిత్రులు, అభిమానుల అశ్రునయనాల మధ్య బీజేపీ సీనియర్‌ నాయకురాలు, విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ (67) అంత్యక్రియలు బుధవారం ఢిల్లీలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. లోధి రోడ్డులోని శ్మశానంలో ఉన్న విద్యుత్‌ దహనవాటికలో అంత్యక్రియలు జరిగాయి. త్రివర్ణ పతాకంతో చుట్టిన ఆమె భౌతిక కాయాన్ని మధ్యాహ్న బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి శ్మశానానికి తరలించారు. గుండెపోటు కారణంగా సుష్మ మంగళ వారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో మరణించారు. ప్రధాని నరేంద్ర మోదీ, భూటాన్‌ ప్రధాని షెరింగ్‌ తాబ్గే, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, పార్టీ సీనియర్‌ నాయకుడు ఎల్‌కే అడ్వాణీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదితర ప్రము ఖ రాజకీయ నాయకులు, సుష్మ కుటుంబసభ్యు లు, స్నేహితులు, ప్రజలు సహా వేలాది మంది సుష్మ అంత్యక్రియలకు హాజరై, విషణ్ణ వదనాలతో తుది వీడ్కోలు చెప్పారు. సుష్మ ఇంటి వద్ద ఆమె భౌతిక కాయానికి నివాళి అర్పిస్తూ మోదీ కంటతడి పెట్టారు.

మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు జంతర్‌ మంతర్‌ లోని సుష్మ ఇంటి వద్ద, 12 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బీజేపీ కార్యాలయంలోనూ సుష్మ భౌతిక కాయాన్ని ప్రజలు, నాయకుల సందర్శనార్థం ఉంచారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి శ్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు ముగిం చారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మోదీ, అమిత్‌ షా, అడ్వాణీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కాంగ్రెస్‌ నాయకురాలు సోనియా గాంధీ తదితర అనేక మంది నేతలు సుష్మ ఇంటికి వెళ్లి, భౌతిక కాయానికి నివాళులర్పించారు. నోబెల్‌ పురస్కార గ్రహీత కైలాశ్‌ సత్యారి్థ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్, బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, కాంగ్రెస్‌ నేతలు రాహు ల్‌ గాం«దీ, గులాం నబీ ఆజాద్, సీపీఎం నాయకు రాలు బృందా కారత్, తృణమూల్‌ ఎంపీ డెరెక్‌ ఒబ్రెయిన్, యోగా గురువు బాబా రాందేవ్, బీజేపీ నాయకురాలు హేమ మాలిని తదితరులు సుష్మ ఇంటికి వెళ్లి నివాళి అరి్పంచారు.  

కన్నీరు పెట్టుకున్న అడ్వాణీ 
సుష్మకు గురువుగా పేరుగాంచిన ఎల్‌కే అడ్వాణీ, సుష్మ భౌతిక కాయం వద్దకు రాగానే కంటతడి పెట్టారు. ఆమె గురించి అడ్వాణీ గుర్తు చేసుకుం టూ, ‘నా ప్రతీ పుట్టిన రోజున నాకు ఎంతో ఇష్టమైన చాకొలేట్‌ కేక్‌ను సుష్మ తీసుకొచ్చేది. నేను నా బృందంలోకి చేర్చుకున్న నిబద్ధత కలిగిన యువ కార్యకర్త ఆమె. కాలక్రమంలో ఆమె మా పార్టీలో గొప్ప పేరున్న, ప్రఖ్యాత నాయకురాలిగా ఎదిగింది. పారీ్టలోని, బయటి మహిళలకు ఆమె ఆదర్శప్రాయురాలు. ఏవైనా సంఘటనలను గుర్తుకు తెచ్చుకోవడంలో ఆమెకున్న జ్ఞాపక శక్తిని చూసి నేను ఎన్నోసార్లు ఆశ్చర్యపోయాను’అని చెప్పారు. కాగా, సుష్మ మరణంతో ఏర్పడిన లోటును పూడ్చటం చాలా కష్టమని అమిత్‌ షా అన్నారు. ‘ఆమెను ప్రేమించే కోట్లాది మంది ప్రజలకు ఇది దుర్దినం. మోదీ నాయకత్వంలో ఆమె ఐదేళ్ల కాలం పనిచేసి, భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా గౌరవం తీసుకొచ్చారు’అని ఆయన పేర్కొన్నారు. 

రాఖీ కట్టడానికి నా చెల్లెలు లేదు: వెంకయ్య 
దయ, ధైర్యం, ప్రేమ, మంచితనాలకు సుష్మా మారుపేరు అని రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు కొనియాడారు. ఆమె అకాల మరణం విచారకరమనీ, దేశం ఓ గొప్ప పాలనాదక్షురాలిని, సమర్థవంతమైన పార్లమెంటేరియన్‌ని, ప్రజల గొంతుకగా నిలిచిన నాయకురాలిని కోల్పోయిందన్నారు. సుష్మకు రాజ్యసభ బుధవారం ఘన నివాళి అరి్పంచింది. ప్రధాని మోదీ కూడా ఆ సమయం లో సభలో ఉన్నారు. సభ సమావేశమైన వెంటనే సుష్మ మరణం గురించి ఓ నోట్‌ను వెంకయ్య చదివి సభ్యులకు తెలియజెప్పారు. దేశం అత్యున్నతంగా ఉండాలని ఆమె ఎప్పుడూ కోరుకునేదని అన్నారు. సుష్మ మరణం తనకు వ్యక్తిగతంగా లోటు అని వెంకయ్య చెబుతూ, ఆ గొప్ప నాయకురాలు చెప్పిన మాటలు, చేసిన పనులు ప్రజా జీవితంలో ఉన్న వారందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. ‘ఆమె నన్ను ఎప్పుడూ అన్నా అని పిలిచేది. మా ఇంట్లో జరిగే కుటుంబ, సంప్రదాయ వేడుకలకు అన్నింటికీ హాజరయ్యేది. ప్రతి రాఖీ పండుగకూ నా చేతికి రాఖీ కట్టేది. ఈ సారి నాకు ఆ గౌరవం దక్కదు. ఆమె మరణంతో నా జీవితంలో ఎంతో విలువైన చెల్లెల్ని నేను కోల్పోయాను’అని వెంకయ్య ఉద్వేగంతో చెప్పారు. 

సంబంధాల బలోపేతానికి ఎంతో కృషి: చైనా 
సుష్మా మృతికి చైనా బుధవారం సంతాపం తెలిపింది. ఇండియా–చైనా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో విదేశాంగ మంత్రిగా ఆమె పాత్రను చైనా గుర్తుచేసుకుంది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్‌ ఓ ప్రకట న విడుదల చేస్తూ, ‘మేడం సుష్మా స్వరాజ్‌ ఇండియాలో సీనియర్‌ రాజకీయ నాయకురాలు. ఆమె మరణం పట్ల మేం సంతాపం తెలుపుతున్నాం. సుష్మ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి. సుష్మ విదేశాంగ మంత్రిగా ఉండగా అనేకసార్లు ఆమె చైనాలో పర్యటించారు. చైనా–ఇండియా సంబంధాలను మరింత ముందకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు’అని తెలిపారు. సుష్మా స్వరాజ్‌ చివరిసారిగా చైనాకు ఈ ఏడాది ఫిబ్రవరిలో వెళ్లి, ఆర్‌ఐసీ (రష్యా, ఇండియా, చైనా) విదేశాంగ మంత్రుల భేటీలో పాల్గొని వచ్చారు. 

అంత్యక్రియలు నిర్వహించిన కూతురు 
సుష్మా స్వరాజ్‌ అంత్యక్రియలను ఆమె కూతురు బాసురీ నిర్వహించారు. స్వరాజ్‌ భౌతిక కాయాన్ని విద్యుత్‌ దహనవాటికలోని ప్లాట్‌ఫాంపై ఉంచిన అనంతరం, ఆ ప్లాట్‌ఫాం చుట్టూ బాసురీ నీటి కుండతో మూడుసార్లు తిరిగారు. అనంతరం కుండను జారవిడిచి పగులగొట్టారు. ప్లాట్‌ఫాం చుట్టూ బాసురీ తిరుగుతున్నప్పుడు ఆమె తండ్రి కూడా తోడుగా ఉన్నారు. వారిద్దరినీ మోదీ ఓదారుస్తూ కనిపించారు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించిన బాసురీ, తన తండ్రితోపాటు సుప్రీం కోర్టులో లాయర్‌గా పనిచేస్తున్నారు.  

పాలు ఒలికిపోయినా ఏమీ అనేవారు కాదు.. 
సుష్మా స్వరాజ్‌ హరియాణాలోని అంబా లా కంటోన్మెంట్‌లో పెరిగారు. రాష్ట్ర మంత్రిగా కూడా ఆమె పనిచేశారు. చిన్నతనంలో ఆమెతో అనుబంధం ఉన్న పలువురు.. సుష్మ మరణం నేపథ్యంలో నాటి విషయాలను గుర్తుచేసుకున్నారు. కంటోన్మెంట్‌లోని బీసీ బజార్‌ ప్రాం తంలో ఆమె ఇల్లు ఉండేది. ఇప్పటికీ అదే ఇంట్లోనే సుష్మ సోదరుడు గుల్షన్‌ తన కుటుంబంతో కలిసి ఉంటున్నారు.  చర్చల్లో పాల్గొనడ మంటే చిన్నప్పటి నుంచి సుష్మకు బాగా ఇష్ట మనీ, బడిలో అనేక పోట్లీలో ఆమె పాల్గొందని చెబుతున్నారు. ‘ఆరో తరగతిలో ఉన్నప్పటి నుంచే సుష్మ రాజకీయాలపై ఆసక్తి చూపేది.  

ఆ దిశలోనే వెళ్లి ఉన్నత శిఖరాలకు చేరింది’అని శ్యామ్‌ బిహారీ అనే వృద్ధుడు చెప్పారు. ఆమె అందరితోనూ ఆప్యాయంగా ఉండేదనీ, ప్రత్యర్థి పార్టీ వాళ్లకు కూడా సాయం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండేదని శ్యామ్‌ గుర్తుచేసుకున్నారు. 60వ పడిలో ఉన్న మరో వ్యక్తి మాట్లాడుతూ చిన్నప్పుడు తాము క్రికెట్‌ ఆడుతుంటే, ఆ దారిలోనే సుష్మ పాల కోసం వెళ్లేదని చెప్పారు. ఎప్పుడైనా క్రికెట్‌ బంతి తగిలి పాలు ఒలికినా ఏమీ అనేది కాదనీ, మీరు బాగా ఆడండి అని చెప్పి వెళ్లిపోయేదని తెలిపారు. సుష్మ సోదరుడి ఇంట్లోని పనిమనిషి సుష్మ మరణ వార్త విని తీవ్రంగా విలపించారు. ‘ఆమె కొన్ని నెలల క్రితం ఇక్కడకు వచ్చారు. నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారని తెలుసుకుని, వారిద్దరికీ బాగా చదువు చెప్పించాలనీ, వారి కోసం ఏదైనా అవసరం అయితే అడగమని చెప్పారు’ అని ఆమె తెలిపారు.  

>
మరిన్ని వార్తలు