మసూద్‌ను భారత్‌కు అప్పగించాలి : సుష్మా స్వరాజ్‌

14 Mar, 2019 12:20 IST|Sakshi

న్యూఢిల్లీ : మేం ఉగ్రవాదులపై దాడి చేస్తే.. పాక్‌ మాత్రం ముష్కరుల తరఫున మా దేశంపై దాడి చేసింది. ఈ ఒక్క విషయం ద్వారా పాక్‌ వక్రబుద్ధి ప్రపంచానికి కూడా తెలిసిందంటూ భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుష్మాస్వరాజ్‌ ఓ ప్రశ్నకు సమాధానంగా.. ‘జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థలను లక్ష్యంగా చేసుకుని భారత్‌ బాలాకోట్‌ మెరుపు దాడులు జరిపింది. కానీ పాక్‌ సైన్యం మాత్రం జైషే తరఫున మన దేశంపై దాడికి ప్రయత్నించింది. ఆ దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఉగ్ర సంస్థలకు ఆర్థికంగా సాయం చేస్తోంది. తీవ్రవాద రహిత వాతావరణంలో మాత్రమే మేం పాక్‌తో చర్చలు జరుపుతాం. చర్చలు, ఉగ్రవాదం కలిసి ముందుకెళ్లవు’ అంటూ సుష్మాస్వరాజ్‌ పాక్‌పై తీవ్రంగా మండిపడ్డారు.

అంతేకాక ‘పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ రాజనీతిజ్ఞుడు అని కొంతమంది చెబుతున్నారు. నిజంగా ఆయనకు అంత ఉదారతే ఉంటే జైషే అధినేత మసూద్‌ను భారత్‌కు అప్పగించాల’ని సుష్మా డిమాండ్‌ చేశారు. అప్పుడే ఇమ్రాన్‌ ఖాన్‌ ఔదార్యం ఏపాటిదో ప్రపంచానికి తెలుస్తుందని సుష్మా ఎద్దేవా చేశారు. పాకిస్తాన్‌ ఉగ్రవాదంపై చర్యలు తీసుకునేంత వరకు ఆ దేశంతో ఎలాంటి చర్చలు జరిపేది లేదని ఆమె స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు