‘భారత్‌లో అలాంటి ప్రదేశం లేదు’

10 May, 2018 15:41 IST|Sakshi
భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ (ఫైల్‌ ఫొటో)

న్యూఢిల్లీ : సోషల్‌ మీడియా ద్వారా సామాన్య ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ.. వారి సమస్యలు పరిష్కరించడంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ముందుంటారు. కానీ కొత్త పాస్‌పోర్ట్‌ కావాలంటూ ఓ వైద్య విద్యార్థి చేసిన ట్వీట్‌ మాత్రం ఆమెకు ఆగ్రహం తెప్పించింది. విషయమేమిటంటే.. జమ్మూ కశ్మీర్‌కు చెందిన షేక్‌ అతీక్‌.. ‘నేను జమ్మూ కశ్మీర్‌కు చెందిన వ్యక్తిని. ఫిలిప్పీన్స్‌లో వైద్య విద్యనభ్యసిస్తున్నాను. నా పాస్‌పోర్టు దెబ్బతినడంతో నెల రోజుల క్రితం కొత్తదాని కోసం దరఖాస్తు చేసుకున్నాను. నా ఆరోగ్యం బాగా లేనందున ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు నాకు తప్పక సాయం చేయాలం’టూ ట్వీట్‌ చేశాడు.

అయితే అతడి ప్రొఫైల్‌ను చెక్‌ చేసిన సుష్మా స్వరాజ్‌.. ‘మీరు జమ్మూ కశ్మీర్‌కు చెందిన వ్యక్తి అయితే.. మీకు తప్పక సాయం చేస్తాము. కానీ మీ ప్రొఫైల్‌లో మీరు భారత ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన వారని ఉంది. భారత్‌లో అయితే అలాంటి ప్రదేశం లేదంటూ’ ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో.. ఒక విదేశాంగ మంత్రిగా అతడికి సాయపడాల్సిన అవసరం ఉందని కొందరు నెటిజన్లు కామెంట్‌ చేయగా.. మరికొందరు అతడికి ఎటువంటి సాయం చేయవద్దంటూ ట్వీట్‌ చేస్తున్నారు.

నెటిజన్ల స్పందనతో కంగుతిన్న అతీక్‌ వెంటనే తన ప్రొఫైల్‌ లొకేషన్‌ మార్చాడు. ఈ విషయాన్ని గమనించిన సుష్మా.. ‘ నీ ప్రొఫైల్‌ మార్చుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. జయదీప్‌.. ఇతను(అతీక్‌) జమ్ము కశ్మీర్‌కు చెందిన భారతీయడు. కాబట్టి ఇతడికి సాయం చేయండి’ అంటూ అధికారులను కోరుతూ మరో ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు