సుష్మా ప్రస్థానం: కాశీ నుంచి కర్ణాటక వరకు

7 Aug, 2019 13:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, విదేశాంగశాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మరణంతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పదవులనే తేడా లేకుండా రాజకీయాల్లో ఆమె శాస్వత ముద్ర వేసుకున్నారు. సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో కొనసాగిన ఆమె తన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకునేవారు. అయితే ఆమె ఏకంగా ఆరు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించి, ఆయా రాష్ట్ర ప్రజల్లో గుర్తింపును పొందారు. 1970లలో హర్యానా అసెంబ్లీ నుంచి మొదలైన ప్రజాజీవితం.. అంచెలంచెలుగా ఎదిగి విదేశాంగ మంత్రి స్థాయికి చేర్చింది. 

హర్యానా: సుష్మా స్వరాజ్ తొలిసారిగా 1977 ఎన్నికల్లో పోటీ చేశారు. హర్యానాలోని అంబాలా నుంచి విజయం సాధించారు. తన 25 ఏళ్ల వయసులోనే సుష్మా హర్యానాలోని దేవీలాల్ సర్కారులో మంత్రిగా పనిచేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే హర్యానా అసెంబ్లీ ఉత్తమ స్పీకర్‌గా మూడుపర్యాయాలు ఎంపికయ్యారు. 
ఢిల్లీ: 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సుష్మ దక్షిణ ఢిల్లీ నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. తరువాత అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 1998లో మరోసారి ఆమె కేంద్రమంత్రిగా సేవలు అందించారు. అయితే ఆ తరువాత ఆమె తన పదవికి రాజీనామా చేసి, ఢిల్లీ తొలి మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ తరువాత జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమితో.. రాజ్యసభకు ఎన్నికయ్యారు.
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌: సుష్మా స్వరాజ్ 2000లో యూపీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ విడిపోయాక కూడా అక్కడి నుంచి రాజ్యసభ సభ్యురాలిగా సేవలందించారు.
మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సుష్మ కీలకపాత్ర పోషించారు. 2009, 2014 ఎన్నికల్లో విదిశ లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు విజయం సాధించారు. అనారోగ్య కారణంగా ఈసారి  ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు. 
కర్ణాటక: యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీపై 1999 లోక్‌సభ ఎన్నికల్లో సుష్మా స్వరాజ్  పోటీ చేశారు. బళ్లారి లోక్‌సభ స్థానంలో సోనియాతో తలపడ్డారు. ఆమె ఓటమి చెందినప్పటికీ అక్కడి ప్రజలతో అప్పుడప్పుడు మమేకమవుతూనే ఉంటారు. తెలంగాణ ప్రజలతోనూ సుష్మా స్వరాజ్‌కు మంచి అనుబంధం ఉంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన సమయంలో లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. బిల్లు ఆమోదం సందర్భంగా ‘తెలంగాణ ప్రజలారా ఈ చిన్నమ్మను గుర్తుపెట్టుకొండి’ అంటూ సుష్మా చేసిన ప్రసంగం  ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. అంతేకాదు  కేంద్ర విదేశాంగ మంత్రిగా వివిధ హోదాల్లో ఆమె 18 దేశాల్లో పర్యటించారు

మరిన్ని వార్తలు