సాయం చేయండి ప్లీజ్‌ - సుష్మా స్వరాజ్‌

11 Mar, 2019 15:02 IST|Sakshi

శిఖా భర్త ఫోన్‌ స్పందించడంలేదు..

శిఖా కుటుంబాన్ని  సంప్రదించేందుకు సాయం చేయండి

న్యూఢిల్లీ:  కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌  మరోసారి  ట్విటర్‌లో బాధితుల పట్ల శరవేగంగా  స్పందిస్తూ తన ప్రాధాన్యతను చాటుకుంటున్నారు. ఇథియోపియాలో ఆదివారం జరిగిన  ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన  భారతీయుల ఆచూకీని కనుక్కోవడంలోనూ ఒక పక్క  ఎంబసీ ఉన్నతాధికారులతో సంప్రదిస్తూ, పూర్తి సహాయ సహకారాలను అందిస్తూ,  మరో పక్క వారి బంధువులకు సమాచారం అందించడంలో మానవతను చాటుకుంటున్నారు. 

ముఖ్యంగా  పర్యావరణశాఖ కన్సల్టెంట్‌ శిఖా గార్గ్‌ కుటుంబానికి ఇంకా ఆమె మరణ వార్త చేరకపోవడంపై  ఆమె ట్వీట్‌  చేశారు. శిఖా గార్గ్‌ మృతి గురించి చెప్పేందుకు ఆమె భర్తకు ఎన్నో సార్లు ఫోన్‌ చేశాను. కానీ ఎలాంటి స్పందన లేదు. ఆమె కుటుంబాన్ని సంప్రదించేందుకు సాయం చేయండి ప్లీజ్‌ అని సుష్మాస్వరాజ్‌ ట్వీట్ చేశారు. సాయం చేయండంటూ ఆమె నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. 

కాగా ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737-8 మాక్స్‌ విమానం ఆదివారం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలోని అందరూ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఎనిమిదిమంది సిబ్బంది సహా 157మంది దుర్మరణం చెందగా, వీరిలో నలుగురు భారతీయులున్నారు. 

మరిన్ని వార్తలు