20 అడుగుల గుంతలో పడ్డ ఎస్‌యూవీ

2 Aug, 2018 13:11 IST|Sakshi

లక్నో : ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్న ఎస్‌యూవీ వాహనం 20 అడుగుల గుంతలో పడిపోయింది. బుధవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న రుచిత్‌ ఇటీవల ముంబైలో సెకండ్‌ హ్యాండ్‌ ఎస్‌యూవీ వాహనాన్ని కొనుగోలు చేశాడు. మరో ముగ్గురితో కలసి తన సొంత ఊరు కాన్నూజ్‌కు రోడ్డు మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.  గూగుల్‌ మ్యాప్స్‌ సహాయంతో ప్రయాణం మొదలుపెట్టిన వారు ఆగ్రాకు 16 కిలోమీటర్ల దూరంలో గల డౌకి వద్దకు రాగానే  ఇంటర్నెట్‌ కనెక్షన్‌ కొల్పోయారు.

ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు సర్వీస్‌ రోడ్డును అనుకుని పెద్ద గుంత ఏర్పడింది. అదే మార్గంలో ప్రయాణిస్తున్న వారు ఇది గమనించకపోవడంతో వాహనం గుంతలో పడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు వాహనంలో ఉన్నవారిని రక్షించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్‌ సహాయంతో గుంతలో పడ్డ ఎస్‌యూవీని బయటకు తీశారు. వాహనంలో ప్రయాణిస్తున్న వ్యక్తులను ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.  సర్వీస్‌ రోడ్డుపై అంత పెద్ద గుంత ఎలా ఏర్పడిందో 15 రోజుల్లో నివేదిక అందజేయాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సంబంధిత వర్గాలను కోరింది. అలాగే కాంట్రాక్టు సంస్థను మరమ్మతులు చేయాల్సిందిగా ఆదేశించింది. 

మరిన్ని వార్తలు