వైజాగ్‌కు 3వ ర్యాంకు, హైదరాబాద్‌కు 22..

4 May, 2017 11:04 IST|Sakshi
వైజాగ్‌కు 3వ ర్యాంకు, హైదరాబాద్‌కు 22..
న్యూఢిల్లీ: స్వచ్ఛభారత్‌ ర్యాంకులు విడుదలయ్యాయి. ఈ ర్యాంకుల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన ఇండోర్‌ మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది ఇదే స్థానంలో ఉన్న మైసూరు ఐదో స్థానానికి పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశాఖపట్టణానికి మూడో ర్యాంకు రాగా, తెలంగాణలోని హైదరాబాద్‌ నగరం మాత్రం 22వ స్థానంలో నిలిచింది. 2014 అక్టోబర్‌ నెలలో స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే.

ఆ తర్వాత ఏడాది నుంచి దీనికింద అవార్డులు ఇస్తున్నారు. ఆయా నగరాల్లో ఉండే మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, బహిరంగ మలమూత్ర విసర్జన శాలల ఏర్పాటు, ఇళ్లల్లో మరుగుదొడ్ల నిర్మాణం, రవాణా వ్యవస్థ, చెత్త శుద్ధి నిర్వహణవంటి అంశాల ప్రాతిపదికన ఈ ర్యాంకులు ప్రకటిస్తారు. తాజాగా మొత్తం 434 నగరాలు, చిన్నచిన్న పట్టణాలకు కలిపి ర్యాంకులు ప్రకటించారు.

వీటిల్లో తొలి 50 ర్యాంకులు పొందిన నగరాల్లో టాప్‌ 5లో ఇండోర్‌, భోపాల్‌, విశాఖపట్నం(వైజాగ్‌) సూరత్‌, మైసూరు ఉండగా.. 50 ర్యాంకుల్లో స్థానం పొందిన తెలుగు రాష్ట్రాల నగరాలను పరిశీలిస్తే వైజాగ్‌(3),  తిరుపతి (9), విజయవాడ(19), గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(22), వరంగల్‌(28), సూర్యాపేట(30), తాడిపత్రి (31), నరసారావుపేట(40), కాకినాడ(43), తెనాలి(44), సిద్దిపేట(45), రాజమండ్రి (46) ర్యాంకులను సొంతం చేసుకున్నాయి. 
మరిన్ని వార్తలు