పాత అలవాట్లు మానుకోవటం కష్టమే...అయితే

2 Oct, 2014 10:32 IST|Sakshi

న్యూఢిల్లీ :  దేశంలో ఉన్న పరిస్థితులను మహాత్మా గాంధీ కళ్లద్దాల ద్వారా చూస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా గురువారమిక్కడ మాట్లాడుతూ మహాత్మాగాంధీ పరిశుభ్ర భారత్ నినాదానికి పిలుపు ఇచ్చారన్నారు. అయితే ఆ నినాదం ఇప్పటికీ  అసంపూర్తిగా ఉండిపోయిందన్నారు.

 

బాపూజీ ఆశయ సాధన కోసం మనమంతా చేయాల్సింది ఒక అడుగు ముందుకు వేయటమేనని మోడీ పిలుపునిచ్చారు. భారతీయులంతా కలిసికట్టుగా పనిచేసి ఒక ప్రేరణాత్మక వాతావరణాన్ని సృష్టించాలన్నారు. మనమంతా దేశభక్తితో ఇది చేయాలే కానీ...రాజకీయ ఉద్దేశంతో కాదని ఆయన అన్నారు. సర్పంచ్ల ప్రోత్సాహంతో వందశాతం  పరిశుభ్రతంగా మారిన గ్రామాలను అనేకం తాను చూశానన్నారు.

పరిశుభ్రత కేవలం సఫాయి కార్మికులదేనా అని మోడీ ప్రశ్నించారు. 125 కోట్ల భారతీయులు ఇక భారతమాతను మురికిగా ఉండాలని అనుకోరని ఆయన అన్నారు. పాత అలవాట్లను మానుకోవటం కొంచెం కష్టమే అని అయితే అందుకు మనకు ఇంకా 2019 వరకూ సమయం ఉందని మోడీ అన్నారు. చెత్త ఉన్న ప్రాంతం ఫోటో తీయండి, ఆ తర్వాత వాటిని శుభ్రం చేశాక ఫోటో తీసి నెట్ లో పెట్టాలని మోడీ అన్నారు. మార్స్ మిషన్ పూర్తి చేసింది ప్రధాని, మంత్రులు కాదని, భరతమాత బిడ్డలని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో అంగారకుడిపై మార్స్ను ప్రయోగించిన మనం దేశాన్ని శుభ్రం చేసుకోలేమా అని ప్రశ్నించారు.  బహిరంగ ప్రదేశాలలో పరిశుభ్రత కార్యక్రమంలో తాను తొమ్మిదిమంది పాల్గొనాలని పిలుపునిచ్చానని...వారు  మరో తొమ్మిది మందికి ఆహ్వానం పంపాలని మోడీ కోరారు.  అపరిశుభ్రత వల్ల వచ్చే రోగాలకు కుటుంబం ఏటా ఆరువేలు ఖర్చు పెడుతుందని మోడీ గుర్తు చేశారు. పరిశ్రుభతను పాటిస్తే ఆ ఆరువేలు ఆదా చేసినవారు అవుతారన్నారు. అనంతరం ఆయన  స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు.

>
మరిన్ని వార్తలు