మావోయిస్టులతో ప్రధాని చర్చలు జరపాలి: అగ్నివేశ్

1 Jul, 2013 21:19 IST|Sakshi
Swami Agnivesh

మావోయిస్టులతో శాంతి చర్చలు ప్రారంభించాలని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ కోరారు. దేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న వామపక్ష హింసాకాండకు శాంతి చర్చలతో ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు. 'మావోయిస్టులతో శాంతి చర్చలకు ప్రధాని చొరవ చూపాలి. గత అనుభవాల దృష్ట్యా ఈ విషయంలో కేంద్ర హోం మంత్రిపై ప్రధాని ఆధారపడరాదు' అని అగ్నివేశ్ పేర్కొన్నారు. ప్రధాని ఒక్కరే ఈ సమస్యను పరిష్కరించగలరని విశ్వాసం వ్యక్తం చేశారు.  


మావోయిస్టులతో చిత్తశుద్ధితో శాంతి చర్చలు జరిపితేనే ఫలితం ఉంటుందని అభిప్రాయపడ్డారు. మావోయిస్టు అధికార ప్రతినిధి, పొలిట్ బ్యూరో సభ్యుడు చెరుకూరి రాజకుమార్ అలియాస్ ఆజాద్ ను నకిలీ ఎన్ కౌంటర్ లో హతమయ్యారని ఆయన ఆరోపించారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు సవ్యంగా లేదని అన్నారు. నాగపూర్ లో 2010, జూలై 1న జరిగిన ఎన్ కౌంటర్ లో ఆజాద్ మృతి చెందిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు