‘ప్రమాద రసాయనం’ వల్లే సునంద మృతి!

17 Jan, 2016 03:50 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసు అమెరికా ఎఫ్‌బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) నివేదికతో  కొత్త మలుపు తిరిగింది. ఆమె మృతికి విషమే కారణమని తేల్చిన ఎయిమ్స్ నివేదికను బలపరిచిన ఎఫ్‌బీఐ.. సునంద శరీరంలో ఉన్న ప్రమాదకర రసాయనమే ఆమె మరణానికి కారణమై ఉండొచ్చని చెప్పింది. రేడియోధార్మిక పదార్థాలే సునంద మృతికి కారణమని అప్పట్లో ఊహాగానాలు వచ్చాయి. శరీరంలో పొలోనియం-210, థాలియం, నెరియం, హెరాయిన్ లాంటి అవశేషాలను గుర్తించే ల్యాబ్‌లు భారత్‌లో లేవని ఎయిమ్స్ నివేదించడంతో పోలీసులు గత ఏడాది ఆమె నమూనాలను  ఎఫ్‌బీఐ ల్యాబ్‌కు పంపారు.  

ఎఫ్‌బీఐ తమకు నివేదిక ఇచ్చినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ శనివారం చెప్పారు. సునందది సహజ మరణం కాదని, అలాగే ఆమె శరీరం నుంచి సేకరించిన నమూనాల్లో ఎలాంటి రేడియో ధార్మిక పదార్థాల్లేవని ఎఫ్‌బీఐ తేల్చిందన్నారు. అయితే ప్రమాదకర రసాయనం ఆమె మరణానికి కారణమై ఉంటుందని చెప్పిందన్నారు. ఇంజెక్షన్ ద్వారా దీన్ని శరీరంలోకి పంపి ఉండొచ్చేమోనని ఎయిమ్స్ ఫోరెన్సిక్ సైన్స్ విభాగం అధిపతి సుధీర్ గుప్తా పేర్కొన్నారు. ఎఫ్‌బీఐ రిపోర్ట్‌ను విశ్లేషించి ఎయిమ్స్ మెడికల్ బోర్డు ఇచ్చిన నివేదిక ఆధారంగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు