అదో వెర్రి కేసు : సుబ్రహ్మణ్య స్వామి

21 Jul, 2020 09:23 IST|Sakshi

బాబ్రీ కేసు మూసివేతపై స్వామి వినతి

సాక్షి, న్యూఢిల్లీ : బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ దిగ్గజ నేత ఎల్‌కే అద్వానీని ఆ పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి సమర్ధించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసేలా సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్‌లో తీర్పు వెలువరించిన బాబ్రీ కేసు మాత్రం అద్వానీ, మురళీమనోహర్‌ జోషీ వంటి బీజేపీ నేతలను వెంటాడుతోంది. 1992 మసీదు విధ్వంసం కేసుకు సంబంధించి  స్టేట్‌మెంట్‌ రికార్డు చేసేందుకు తమ ఎదుట హాజరుకావాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం 92 ఏళ్ల అద్వానీకి సమన్లు జారీ చేయడంపై సుబ్రహ్మణ్య స్వామి మంగళవారం స్పందించారు. మూడు దశాబ్ధాల కిందట దేశవ్యాప్తంగా కలకలం రేపిన బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనను స్వామి సమర్ధిస్తూ ఈ కేసును మూసివేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.

బాబ్రీ ఘటనలో వారు పాలుపంచుకుంటే ఆ స్ధలంలో ఆలయ పునర్మిర్మాణానికి సాయపడతారని అన్నారు. అయోధ్య రామ జన్మభూమిలో మందిర నిర్మాణానికి శంకుస్ధాపన జరుగుతున్న నేపథ్యంలో వృద్ధ నేతలు అద్వానీ, మురళీమనోహర్‌ జోషీలను అయోథ్యకు తీసుకువెళ్లేముందు వారిపై ఉన్న వెర్రి కేసును మూసివేసేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉత్తర్వులు జారీ చేయాలని సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్‌ చేశారు. ఆగస్ట్‌ 5న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంకుస్ధాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. కాగా 1992 డిసెంబర్‌ 6న అయోధ్యలో బాబ్రీమసీదును కరసేవకులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. మసీదు నిర్మించిన చోట ఆలయం ఉందనే వాదనతో మసీదును నేలమట్టం చేశారు. ఎల్‌కే అద్వానీ, మురళీమనోహర్‌ జోషీలు అప్పట్లో రామమందిర ఉద్యమానికి నేతృత్వం వహించారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో వీరితో పాటు బీజేపీ ప్రముఖ నేతలు అశోక్‌ సింఘాల్‌, ఉమాభారతి.. వంటివారి పేర్లు ఉన్నాయి. కరసేవకులను రెచ్చగొట్టి మసీదును కూల్చివేశారని వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చదవండి : అద్వానీ వాంగ్మూలం తీసుకోనున్న సీబీఐ కోర్టు

మరిన్ని వార్తలు