ఇంతకన్నా ఏం కావాలి?

23 Jan, 2020 16:03 IST|Sakshi

న్యూఢిల్లీ: విలక్షణ నటుడు నసీరుద్దీన్‌ షాపై సుష్మా స్వరాజ్‌ భర్త, మిజోరం మాజీ గవర్నర్‌ స్వరాజ్‌ కౌశల్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నసీరుద్దీన్‌కు దేశం ఎంతో పేరుప్రతిష్టలు ఇచ్చినా దేశం పట్ల ఆయనకు కృతజ్ఞత లేదని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా మాట్లాడిన సీనియర్‌ నటుడు, బీజేపీ నేత అనుమప్‌ ఖేర్‌ను నసీరుద్దీన్‌ విమర్శించిన నేపథ్యంలో స్వరాజ్‌ కౌశల్‌ ట్విటర్‌లో స్పందించారు.

‘మిస్టర్‌ నసీరుద్దీన్‌ షా మీరు కృతజ్ఞత లేని వ్యక్తి. ఈ దేశం మీకు పేరు, ప్రతిష్టలతో పాటు ఐశ్వర్యాన్ని ఇచ్చింది. ఇప్పటికీ అజ్ఞానంలోనే ఉన్నారు. మీ మతం కాని మహిళను మీరు పెళ్లి చేసుకున్నా ఎవరూ మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు. మీ సోదరుడు భారత సైన్యంలో లెఫ్టినెంట్‌ జనరల్‌ అయ్యారు. సమాన అవకాశాలకు ఇంతకన్నా ఏం కావాలి. అయినప్పటీకి మీకు సంతృప్తి లేదు. పక్షపాతం​, వివక్షపూరితంగా మాట్లాడుతున్నారు. మనస్సాక్షి ఉంటే ఆత్మ పరిశీలన చేసుకోండి. స్వదేశంలో నిరాశ్రయులుగా మారి పడ్డ కష్టాల గురించి అనుపమ్‌ మాట్లాడారు. దేశం ఎన్ని ఇచ్చినా మీరు మాత్రం దేశానికి కనీసం కృతజ్ఞత కూడా చెప్పలేదు. హుందా కలిగిన వ్యక్తిగా అనుపమ్‌ స్పందించారు. మీ మాటలను బట్టి చూస్తే మీరు అల్పంగా కనిపిస్తున్నారు. నిరాశ నుంచి మీ కోపం వ్యక్తమవుతున్నట్టు కనబడుతోంద’ని స్వరాజ్‌ కౌశల్‌ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.

కాగా, ఏబీవీపీ దాడిలో గాయపడిన జేఎన్‌యూ విద్యార్థులను పరామర్శించిన హీరోయిన్‌ దీపికా పదుకొనేను ప్రశంసించిన నసీరుద్దీన్‌ బుధవారం అనుపమ్‌ ఖేర్‌పై విమర్శలు చేశారు. నరేంద్ర మోదీ సర్కారుకు బాకా ఊదుతున్నారని, ఆయనను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. (చదవండి: ఆమె ధైర్యాన్ని ప్రశంసించిన నటుడు)

Poll
Loading...
Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా