విడాకులు తీసుకున్న స్వాతి మలివాల్‌

20 Feb, 2020 10:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌...భర్తతో విడాకులు తీసుకున్నారు.  ఆమ్‌ ఆద్మీ పార్టీ హర్యానా కన్వీనర్‌ నవీన్‌ జైహింద్‌(39) నుంచి ఆమె చట్టబద్దంగా విడిపోయారు. స్వాతి మలివాల్‌ దేశంలోనే అత్యంత పిన్న వయసులో మహిళా కమిషన్‌ బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. భర్తకు విడాకులిచ్చినట్లు బుధవారం ప్రకటించిన ఆమె.. దంపతులుగా కలిసుండటంలో, విడిపోవాలనుకున్నప్పుడు ఎదుర్కొన్న సమస్యల్ని ప్రస్తావిస్తూ భావోద్వేగంతో కూడిన సందేశాన్ని పోస్టు చేశారు. 

ఘజియాబాద్‌ లో పుట్టిపెరిగిన స్వాతి, ఢిల్లీలోని ప్రఖ్యాత జేఎస్‌ఎస్‌ కాలేజీలో ఐటీలో డిగ్రీ చేశారు. అన్నా హజారే నేతృత్వంలో ఉధృతంగా సాగిన అవినీతి వ్యతిరేక పోరాటంలో ఆమె భాగం పంచుకున్నారు. ఆ ఉద్యమంలోనే ఆమెకు  నవీన్‌ జైహింద్‌ తో పరిచయం, ప్రేమ ఏర్పడ్డాయి. కొంతకాలం కలిసుండి పెళ్లిచేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరిపోయారు. పార్టీ హర్యానా విభాగానికి నవీన్‌ కన్వీనర్‌ కాగా, ఢిల్లీలో ఎమ్మెల్యే టికెట్‌ మిస్‌ కావడంతో స్వాతికి మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ పదవి దక్కింది. 

చిచ్చుపెట్టిన మీటూ.. 
చిన్న వయసులోనే డీసీఎం చైర్‌ పర్సన్‌ గా బాధ్యతలు చేపట్టిన స్వాతి మలివాల్‌.. మహిళల సమస్యల పరిష్కారానికి తీవ్రంగా పాటుపడ్డారు. చిన్నారులపై అత్యాచారాలు చేసేవాళ్లకు కఠినంగా శిక్షలు విధించేలా పోక్సో చట్టం రావడంలో ఆమె కృషి కూడా ఉంది. అత్యాచారాలకు వ్యతిరేకంగా ఇటీవలే నిరాహార దీక్ష కూడా చేపట్టారామె. కాగా, మీటూ ఉద్యమం సమయంలో స్వాతి భర్త నవీన్‌.. మహిళలను కించపరుస్తూ చేసిన కామెంట్లు దంపతుల మధ్య చిచ్చుపెట్టింది. అప్పటి నుంచి క్రమంగా దూరమైన జంట.. బుధవారం నాటికి విడాకులు తీసుకుంది. 

మరిన్ని వార్తలు