పేగుబంధం అన్వేషణ

25 Feb, 2020 08:39 IST|Sakshi
భర్త ఎరిక్‌తో జూలీ

స్వీడన్‌ నుంచి మండ్యకు  

అనాథ యువతి ఆరాటం

పాత తరం చిత్రాల్లో అంటే 70, 80వ దశకంలో వచ్చిన చిత్రాలు ఎప్పుడైనా చూశారా?ఆ చిత్రాల్లో హీరోయిన్‌ లేదా హీరోలు చిన్నతనంలోనే తల్లిదండ్రుల నుంచి అనుకోని పరిస్థితుల్లో విడిపోవడం, కొన్నేళ్లఅనంతరం పెరిగి పెద్దవుతారు. అనంతరం అనుకోని ఘటనల ద్వారాఅసలైన తల్లితండ్రుల గురించి తెలిసి వారి కోసం అన్వేషిస్తూ ప్రయాణం మొదలుపెట్టడం. అచ్చం ఇటువంటి సంఘటనే మండ్యలో వెలుగు చూసింది. ఆ కథేంటో ఒకసారి తెలుసుకోవాలంటే మండ్యనుంచి స్వీడన్‌కు వెళ్లాల్సిందే.  

కర్ణాటక ,మండ్య:  1987వ సంవత్సరంలో మండ్య జిల్లా దేశహళ్లి గ్రామానికి చెందిన జయమ్మ, బోరేగౌడ దంపతులకు ఓ పాప జన్మించింది. ఏడేళ్ల అనంతరం అంటే 1994లో జయమ్మకు కేన్సర్‌ వ్యాధి రావడంతో చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. చికిత్స కోసం మొత్తం డబ్బులు ఖర్చు చేయాల్సి రావడంతో అసలే పేదరికంలో ఉన్న దంపతులకు కూతురును పెంచడం భారంగా మారింది. దీంతో ఇందిరానగర్‌లోనున్న ఓ అనాథశ్రమంలో కూతురును వదిలేసి వెళ్లిపోయారు .కొద్ది రోజులకు స్వీడన్‌ దేశానికి చెందిన ఓ జంట ఈ పాపను దత్తత తీసుకొని జూలిగా నామకరణం చేసి తమతో సాటు స్వీడన్‌కు తీసుకెళ్లి సొంత కూతురిలా పెంచి వివాహం సైతం చేశారు.  

కల పరమార్థం తెలిసి  
అయితే కొద్ది రోజులుగా ఎవరో తన కలలోకి వస్తుండడం, అందులో ఓ మహిళ కాలువలో దూకి ఆత్మహత్యకుచేసుకుంటున్నట్లు కనిపిస్తుండడంతో ఇదే విషయాన్ని పెంపుడు తల్లితండ్రులకు తెలిపింది. దీంతో జూలికి అసలు విషయం తెలపడంతో భర్త ఎరిక్‌తో కలసి కన్నవారి కోసం మండ్య జిల్లాలోని స్వగ్రామం దేశిహళ్లికి వచ్చి కన్నవారి కోసం వెతకడానికి నిర్ణయించుకుంది. కొద్దిరోజుల క్రితం దేశిహళ్లికి చేరుకొని తల్లిదండ్రుల కోసం గాలించింది. ఎన్నో ఆశలతో వచ్చిన జూలికి నిరాశే ఎదురైంది. జయమ్మ, బోరేగౌడల గురించి ఎవరూ వివరాలు చెప్పలేకపోయారు. అయినప్పటికీ తల్లితండ్రుల ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తానని, తప్పకుండా కన్నవారిని కలుసుకుంటానని నమ్మకం వెలిబుచ్చింది.

మరిన్ని వార్తలు