ఇది తినే క‌రోనా

6 Apr, 2020 17:31 IST|Sakshi

కోల్‌క‌తా: ఎక్క‌డైనా కంటికి ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించేవాటిపైనే మ‌న చూపు లాగుతుంటుంది. చూడ‌టానికి బాగుంటేనే దాన్ని టేస్ట్ చేయాల‌న్న కోరిక‌ పుడుతుంది. అయితే ఇక్క‌డ ఆక‌ర్ష‌ణీయం అన్న‌మాట ప‌క్క‌న‌పెడితే.. కాస్త ఆశ్చ‌ర్య‌క‌రంగా క‌నిపించే ఓ స్వీట్ మార్కెట్‌లోకి వ‌చ్చింది. దాన్ని తినాలంటే మాత్రం మీరు ప‌శ్చిమ బెంగాల్‌కు వెళ్లాల్సిందే. లాక్‌డౌన్ పుణ్య‌మా అని అన్నింటికీ బ్రేక్ ప‌డితే కొన్ని ర‌కాల దుకాణాల‌కు మాత్రం మిన‌హాయింపు దొరికింది. అందులో స్వీట్స్ షాపు కూడా ఒక‌టి. అయితే గిరాకీ లేక‌ చాలా చోట్ల‌ దుకాణ‌దారులు ఈగ‌లు తోలుకుంటూ కూర్చుంటున్నారు. ఈ త‌రుణంలో కోల్‌క‌తాలోని ఓ షాపు నిర్వాహ‌కుడు క‌రోనా వైర‌స్ న‌మూనాతో స్వీట్లు త‌యారుచేసి జంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాడు. అనంత‌రం ఆ స్వీట్ల‌ను అందంగా ఓ ట్రేలో అమ‌ర్చి అమ్మ‌కానికి పెట్టాడు. (స్వీట్స్‌ ‘గడువు తేదీ’ ప్రదర్శించాల్సిందే)

దీనికి సంబంధించిన ఫొటోల‌ను ప్రీతి భ‌ట్టాచార్య అనే ట్విట‌ర్ యూజ‌ర్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా ప్ర‌స్తుతం అవి వైర‌ల్‌గా మారాయి. దీనిపై నెటిజ‌న్లు స్పందిస్తూ 'వామ్మో, పేరు వింటేనే గుండెల‌దురుతున్నాయి.. అలాంటిది ఏకంగా దాన్ని తిన‌డ‌మే?’ అని నోటికి తాళం వేసుకుంటున్నారు. 'దేన్నీ వ‌ద‌ల‌రుగా, మీ క్రియేటివిటీ త‌గ‌లెయ్య’, 'క‌రోనాను కర‌క‌రా న‌మిలి, నామ‌రూపాల్లేకుండా చేస్తాం’ అని ర‌కర‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆ రాష్ట్రంలో స్వీటు దుకాణాలు ప్ర‌తిరోజు నాలుగు గంట‌ల‌పాటు తెరిచి ఉంచుకునే అవ‌కాశాన్ని ప్ర‌భుత్వం క‌ల్పించింది. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు దుకాణాలు తెరిచి ఉంచుకోవ‌చ్చని, కానీ.. సిబ్బంది సంఖ్య ప‌రిమితంగా ఉండేట్లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించింది. (రుచిని చాట్‌కుందాం!)

మరిన్ని వార్తలు