డెలివరీ బాయ్‌కు పని ఇప్పిస్తామంటున్న నెటిజన్లు

10 Jan, 2020 16:42 IST|Sakshi

ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు విశాల్‌. అతను స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఎప్పటిలానే ఆ రోజు కూడా ఓ ఇంటికి ఫుడ్‌ ఆర్డర్‌ చేయడానికి వెళ్లాడు. ఆ ఇంట్లోని వ్యక్తి నిఖిల్‌ డెలివరీ బాయ్‌ను మంచినీళ్లు కావాలా అని అడిగాడు. ఆ తర్వాత మాటలు కలుపుతూ మీరేం చేస్తారు? అని అడిగాడు. అతను ఆర్టిస్ట్‌ అని చెప్పాడు. అతను గీసిన చిత్రాలను చూసి ముగ్ధుడైన నిఖిల్‌ విశాల్‌ గురించి సోషల్‌ మీడియాలో వివరంగా చెప్పాడు. దాంతోపాటు అతను గీసిన కళాఖండాలను కూడా పోస్ట్‌ చేశాడు. అతను తనకు సరిపడే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు అని పేర్కొన్నాడు.

ఈ విషయం తెలిసిన నెటిజన్లు అతని ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. చాలామంది తమకు పెయింటింగ్‌ గీసిపెడతావా? అని ఆర్డర్లు ఇస్తూ అతని వెంటపడుతున్నారు. మరికొంతమందైతే జాబ్‌ ఆఫర్‌ కూడా చేస్తున్నారు. ఇలా ఒక్క ట్వీట్‌తో అతని జాతకమే తిరిగిపోయిందనుకోండి. దీనిపై విశాల్‌ మాట్లాడుతూ.. నా గురించి ట్వీట్‌ చేశారని నాకు తెలియదు. నేను మామూలుగా ఫుడ్‌ డెలివరీ చేయడానికి వెళ్లాను. అప్పుడు ఆ వ్యక్తి నా గురించి అడిగితే నేను ఆర్టిస్ట్‌నని చెప్పాను. నేను గీసిన చిత్రాలు చూసిన అతనికి నా పని  చాలా నచ్చినట్లుంది. అందుకే ట్వీట్‌ చేశాడనుకుంటా’నని చెప్పుకొచ్చాడు. విశాల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘వృత్తిరీత్యా ఆర్టిస్ట్‌.. తప్పని పరిస్థితుల్లో డెలివరీ బాయ్‌’, ‘నచ్చిన పని చేస్తూ కాస్త బ్రెడ్‌ ముక్క సంపాదించుకున్నా సంతోషమే’ అని రాసుకున్నాడు.

మరిన్ని వార్తలు