లాక్‌డౌన్: త‌బ్లిగి జ‌మాత్ చీఫ్ కూతురి నిఖా వాయిదా

5 Apr, 2020 16:17 IST|Sakshi

న్యూ ఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో మ‌త‌ప‌ర‌మైన ప్రార్థ‌న‌లు నిర్వ‌హించి దేశ ప్ర‌జ‌ల ఆగ్ర‌హావేశాల‌కు గురైన‌ త‌బ్లిగి జ‌మాత్ అధ్య‌క్షుడు మౌలానా సాద్ కంధ‌ల్వి త‌న కూతురు వివాహాన్ని వాయిదా వేసిన‌ట్లు స‌మాచారం. ఢిల్లీలో ఏప్రిల్ 5న మౌలానా కూతురు పెళ్లి జ‌ర‌గాల్సి ఉంది. దీనికి షామ్లీ, ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌, శ‌హ‌ర‌న్‌పూర్ నుంచి అతిథుల‌ను సైతం ఆహ్వానించారు. అయితే ప్ర‌స్తుతం అమ‌ల‌వుతున్న లాక్‌డౌన్ వ‌ల్ల రాక‌పోక‌లు నిలిచిపోవ‌డంతో పెళ్లిని వాయిదా వేసిన‌ట్లు ఆయ‌న స‌న్నిహితుడు పేర్కొన్నారు. లాక్‌డౌన్ ముగిసిన వెంట‌నే మ‌రో తేదీని నిశ్చ‌యించుకుని మత పెద్ద‌లు, బంధువుల స‌మ‌క్షంలో ఘ‌నంగా వివాహం జ‌రిపేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలిపారు. కాగా ప్ర‌స్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిన మౌలానా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. తాజాగా ఆయ‌న‌ కరోనా వ్యాప్తి నివారణకు ప్ర‌భుత్వ ఆదేశాల‌ను పాటించాలంటూ జ‌మాత్ స‌భ్యుల‌ను ఉద్దేశిస్తూ ఓ ఆడియోను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. (కరోనా బాధితుల్లో ఎక్కువమంది ఈ వయస్సు వారే!)

దేశ రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగిన‌ త‌బ్లిగి జ‌మాత్ స‌భ్యుల స‌మావేశం తీవ్ర క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. నిజాముద్దీన్‌లోని మ‌ర్క‌జ్ మ‌సీదులో గ‌త నెల 13 నుంచి 15 వ‌ర‌కు మ‌త‌ప‌ర‌మైన ప్రార్థ‌న‌లు జ‌రిగాయి. దీనికి వివిధ రాష్ట్రాల‌ నుంచే కాక‌ విదేశీయులు సైతం పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. అయితే ఈ స‌మావేశాల్లో పాల్గొన్న వారు క‌రోనాతో తిరిగి స్వ‌స్థ‌లాల‌కు వెళ్ల‌డంతో ఒక్క‌సారిగా కేసుల సంఖ్య అమాంతం పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ సైతం ప్ర‌క‌టించింది. ఈ మ‌త‌ప‌ర‌మైన ప్రార్థ‌న‌లు నిర్వ‌హించిన త‌బ్లిగి జ‌మాత్ అధ్య‌క్షుడు మౌలానా సాద్‌పై పోలీసులు కేసు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. (‘తబ్లిగి జమాత్‌’తో పెరిగిన కేసులు)

మరిన్ని వార్తలు