తబ్లిగీ జమాత్‌: 13,702 మంది..

3 Apr, 2020 10:09 IST|Sakshi

మొబైల్‌ టవర్‌ సిగ్నల్స్‌ ఆధారంగా గుర్తింపు!

హైదరాబాద్‌: దేశ రాజధానిలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌ సమావేశాలకు హాజరైన వారిలో అత్యధికులు ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడటం కలకలం రేపుతోంది. ఈ కార్యక్రమానికి హాజరైన సుమారు 9,000 మందిని క్వారంటైన్‌లో ఉంచినట్లు కేంద్ర హోం శాఖ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం మొత్తం 13,702 మంది తబ్లిగీ జమాత్‌ కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తోంది. మొబైల్‌ టవర్‌ సిగ్నల్స్‌ విశ్లేషణ ద్వారా సమావేశానికి హాజరైన వారి లెక్కలను అంచనా వేయడంలో ఆంధ్రప్రదేశ్‌ పోలీసు అధికారులు కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. అయితే ఢిల్లీకి వెళ్లిన వారి సంఖ్య భారీగా ఉండటం... వివిధ రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో... వారందరినీ గుర్తించడం అధికారులకు సవాలుగా పరిణమించింది.

ఇక ప్రస్తుతం గుర్తించిన 13,702 మందిలో దాదాపు 7930 మందిపై కరోనా తీవ్ర ప్రభావం చూపనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తబ్లిగీ జమాత్‌కు హాజరైన వారి కారణంగా ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, బిహార్‌, జార్ఖండ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో అత్యధిక మంది కరోనా వైరస్‌ బారిన పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. కాబట్టి ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని... ఢిల్లీకి వెళ్లిన వారు బాధ్యతగా వ్యవహరించి వైద్య పరీక్షల కోసం ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. (తబ్లిగ్‌ జమాత్‌ : ఆడియో విడుదల)

కాగా గుంటూరులోని ఓ నియోజవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి సమీప బంధువుకు కరోనా సోకడంతో స్థానిక పోలీసులు అప్రమత్తమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ కార్యక్రమానికి హాజరైన ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కూడా మహమ్మారి బారిన పడినట్లు గుర్తించారు. దీంతో పాలనా యంత్రాంగాలు అప్రమత్తమై వెంటనే రంగంలోకి దిగాయి. కేంద్ర సంస్థలతో సమన్వయమై తబ్లిగ్‌ జమాత్‌కు హాజరైన వారి వివరాలు సేకరిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో కోవిడ్‌–19ను సమగ్ర వ్యూహంతో ఎదుర్కొంటున్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలిపిన విషయం తెలిసిందే.

  • తబ్లీగ్‌ జమాతేకు ఏపీ నుంచి వెళ్లినవారు 1085
  • వీరిలో రాష్ట్రంలో ఉన్నవాళ్లు వాళ్లు 946
  • ఇందులో 881 మందికి పరీక్షలు పూర్తి
  • వీరిలో 108 మందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌
  • జమాతేకు వెళ్లిన వారి కుటుంబ సభ్యులు వారితో, కాంటాక్ట్‌ అయినవారు 613 మందికి పరీక్షలు
  • వీరిలో 32 మంది పాజిటివ్‌
  • మొత్తం 161 పాజిటివ్‌ కేసుల్లో 140 మంది ఢిల్లీ జమాతే సదస్సుకు వెళ్లినవారు, వారిలో కాంటాక్ట్‌ అయినవారే
>
మరిన్ని వార్తలు