టైలర్‌ కొడుకు.. సీఏ టాపర్‌!

27 Jan, 2019 22:00 IST|Sakshi

కోటా: లక్షల రూపాయల ఫీజు కట్టి, మంచి కోచింగ్‌ సెంటర్లో చేర్పిస్తేనే ర్యాంకులు వస్తాయా? అవసరం లేదని నిరూపించాడు రాజస్థాన్‌ విద్యార్థి షాదాబ్‌ హుస్సేన్‌. ఫస్ట్‌ అటెంప్ట్‌లోనే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించిన సీఏ ఫలితాల్లో హుస్సేన్‌ మొదటి స్థానంలో నిలిచాడు. ర్యాంకులకు కోచింగ్‌ సెంటర్లతో పనిలేదని, పట్టుదల, కృషి, ప్రణాళిక ఉంటే ఫలితం తప్పకుండా ఉంటుందని మరోసారి నిరూపించాడు. కోటాలో ఒక చిన్న టైలరింగ్‌ దుకాణాన్ని నడిపే హుస్సేన్‌ తండ్రి 10వ తరగతి వరకే చదవగా.. తల్లి మధ్యలోనే చదువు ఆపేసింది.

వీరికి నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు. తాము చదువుకోకపోయినా పిల్లల్ని బాగా చదివించాలనుకున్నారు ఆ తల్లిదండ్రులు. చాలీచాలని ఆదాయంతో పిల్లల్ని చదివించడం ఏ తల్లిదండ్రులకైనా కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో కూడా షాదాబ్‌ హుస్సేన్‌ కోటా యూనివర్సిటీ నుంచి బీకామ్‌ డిగ్రీ పూర్తి చేశాడు. చార్టర్డ్‌ అకౌంటెన్సీ చదవాలనుకున్నాడు. సీఏ చదవడం అంటే అంత సులువు కాదని తెలిసినా పట్టుదలతో చదివి, తొలి ప్రయత్నంలోనే టాపర్‌గా నిలిచాడు. తాను ఈ ఘనత సాధించడానికి తన తండ్రి, కుటంబ ప్రోత్సాహమే కారణమని హుస్సేన్‌ సగర్వంగా చెబుతున్నాడు.

మరిన్ని వార్తలు