మహిళల రక్షణకు చర్యలు తీసుకోండి

7 Dec, 2019 04:06 IST|Sakshi
కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌భల్లా

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ లేఖ

న్యూఢిల్లీ: మహిళల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర హోంశాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. గత కొద్ది రోజులుగా వెలుగు చూస్తున్న అత్యాచార ఘటనలు, దాడుల నేపథ్యంలో లేఖ రాస్తున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌భల్లా తెలిపారు. మహిళల రక్షణ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ఆయన చెప్పారు. మహిళలకు రక్షణ కల్పించేందుకు చట్టాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, అయినప్పటికీ పోలీసులు వెంటనే స్పందించడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు.

జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయడంలో పోలీసులు విఫలమైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మహిళలు, బాలికలకు సంబంధించిన ఫిర్యాదుల విషయంలో పోలీసులు వేగంగా స్పందించాలని కోరారు. ఇన్వెస్టిగేషన్‌ ట్రాకింగ్‌ సిస్టం ఫర్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌ (ఐటీఎస్‌ఎస్‌ఓ)  పోర్టల్‌ ద్వారా ఆయా రాష్ట్రాలలోని అత్యాచార కేసుల విచారణను రెండు నెలల్లోగా పూర్తయ్యేలా పర్యవేక్షణ చేసుకోవచ్చని అందులో సూచించారు.  

>
మరిన్ని వార్తలు