‘టిక్‌టాక్‌’తో టేక్‌ కేర్‌

16 Feb, 2019 04:21 IST|Sakshi

వినోదమే కాదు..వివాదాలు కూడా..

నిషేధించాలని ప్రభుత్వాలపై ఒత్తిళ్లు

టిక్‌టాక్‌... ఇప్పుడు ఈ పేరు తెలియని యువత లేదు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను అధిగమించి టిక్‌ టాక్‌ ముందు వరుసలో నిలిచిందంటే ఇది ఎంత పాపులర్‌ యాపో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్‌ వినియోగదారుల్లో భారతీయులే అధిక శాతం ఉండటం విశేషం కాగా, వివాదాల్లోనూ ఈ యాప్‌ ముందు వరుసలోనే ఉంది. 

చైనాలో ఈ యాప్‌ 2016లో ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది వినియోగదారులతో 75 భాషల్లో ఈ అప్లికేషన్‌ టాప్‌ సోషల్‌ యాప్‌లలో ఒకటిగా ట్రెండ్‌ అవుతోంది. ఎలాంటి ప్రత్యేకమైన సెటప్‌ లేకుండా ఫోన్‌ని చేతిలో పట్టుకొని 15 సెకండ్ల వ్యవధితో రెడీమేడ్‌గా ఉండే డైలాగ్స్, పాటలకు తగ్గట్లు పెదాలను సింక్‌ చేస్తూ చాలా వేగంగా షార్ట్‌ వీడియోలు తీయగలగడం దీని ప్రత్యేకత. ఎన్నో కొత్తకొత్త యాప్స్‌ వచ్చినా, యూత్‌ని ఎక్కువగా అట్రాక్ట్‌ చేసింది మాత్రం ‘టిక్‌ టాక్‌’అనే చెప్పాలి. ఈ యాప్‌ చూడ్డానికి డబ్‌ స్మాష్‌లానే ఉంటుంది కానీ, ఇందులో మ్యూజికల్‌ వీడియోలు ఉంటాయి. ఈ యాప్‌ ద్వారా ఒకే వీడియోలో ఒక్కరు లేదా ఇద్దరూ పార్టిసిపేట్‌ చేయొచ్చు. డైలాగ్స్, ఎమోషన్స్, సాంగ్స్‌ అన్ని రకాల ప్రతిభాపాటవాలను ఈ యాప్‌ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయొచ్చు. తమ టాలెంట్‌ను ప్రూవ్‌ చేసుకుని సోషల్‌ మీడియాలో సత్తా చాటి.. రంగుల ప్రపంచంలోకి అడుగుపెడదామని కలలుకంటున్న యూత్‌కి ‘టిక్‌టాక్‌’ ఒక వేదికలా నిలుస్తోంది.

దుర్వినియోగమూ ఎక్కువే.. 
టిక్‌టాక్‌ని ఎంతమంది వారి ప్రతిభను ప్రదర్శించడానికి ఉపయోగిస్తున్నారో, అంతకుమించి దుర్వినియోగం కూడా చేస్తున్నారు. కొందరు అడల్ట్‌ కంటెంట్‌ని కూడా అప్‌లోడ్‌ చేస్తున్నారు. అశ్లీల దృశ్యాలతో కొందరు యువతీ, యువకులు వీడియోలు తీయడం, మరికొంతమంది వికృత చేష్టలు, పిచ్చి పనులుచేస్తూ ఆ వీడియోలను కూడా పోస్ట్‌ చేయడంతో వివాదం కూడా అవుతోంది. ఇటీవల చెన్నై ముగప్పేర్‌ ప్రాంతానికి చెందిన ఒక బాలిక స్థానికంగా ఓ సంస్థలో నటనలో శిక్షణ పొందుతోంది. టిక్‌టాక్‌ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి 15 ఏళ్ల బాలికకు సినిమా చాన్స్‌ ఇప్పిస్తానని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే రాష్ట్రం సేలం జిల్లా కలెక్టర్‌ రోహిణి ఫొటోలను పెట్టి ఒక టిక్‌ టాక్‌ వీడియో తయారు చేసి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దానిని వైరల్‌ చేశారు. సినిమా పాటలతో లింక్‌ చేసి టిక్‌టాక్‌ యాప్‌లో పోస్ట్‌ చేశారు. వీటిని గమనించిన కలెక్టర్‌ దిగ్భ్రాంతి చెంది, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ యాప్‌ను నిషేధిం చాలంటూ తమిళనాడు పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్‌.రాందాస్‌ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సోషల్‌ మీడియా వల్ల జరిగే నేరాలకు టిక్‌టాక్‌ యాప్‌ కూడా కారణమవుతోందని ఆయన ఆరోపిస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ’టిక్‌ టాక్‌’ యాప్‌పై ప్రత్యేక చర్చ జరిగింది. తక్షణమే ఈ యాప్‌ను నిషేధించాలని ఎమ్మెల్యే తమీమున్‌ హన్సారీ డిమాండ్‌ చేశారు. 
– సాక్షి, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు