రాజకీయ హింసపై సీపీఎం స్పందించాలి: సీపీఐ

20 Jan, 2017 16:31 IST|Sakshi
హైదరాబాద్‌: కేరళలో రాజకీయ హింస పెచ్చుమీరటం పట్ల సీపీఐ ఆందోళన వ్యక్తం చేసింది. హింసాత్మక సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అక్కడి సీపీఎం నేతృత్వంలో అధికార ఎల్డీఎఫ్‌ ప్రభుత్వాన్ని కోరింది. శుక్రవారం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ హింసను తీవ్రంగా పరిగణించాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ దుష్ప్రచారం గోబెల్స్‌ స్థాయిలో ఉందని అన్నారు. బీజేపీ నాయకులపై సీపీఎం శ్రేణులు కూడా దాడులకు పాల్పడుతున్నాయని అన్నారు. 
 
అయితే, ఈ విషయంలో బీజేపీ శ్రేణుల దాడులే ఎక్కువగా ఉంటున్నాయని వ్యాఖ్యానించారు. ఇటువంటి ఘటనలు జరగకుండా రెండు పక్షాల వారు కూడా సంయమనం పాటించాలని, దీనిపై చర్చ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. హింసను నివారించే క్రమంలో అధికార సీపీఎం పార్టీయే ముందుకు అడుగేయాల్సి ఉందని చెప్పారు. వామపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు ఎక్కువగా జరుగున్నాయని వాదనను ఆయన కొట్టేపారేశారు.
మరిన్ని వార్తలు