భారత్‌-చైనా మధ్య కీలక చర్చలు

18 Jun, 2020 10:52 IST|Sakshi
ఫైల్‌ ఫొటో

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌-చైనా మధ్య సరిహద్దు వివాదంలో చెలరేగిన నేపథ్యంలో ఇరు దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సమస్యను దౌత్యపరంగా పరిష్కరించుకునేందుకు ముందడుగా వేశాయి. గడిచిన మూడు రోజులుగా లద్దాఖ్‌ రీజియన్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో ఇరు దేశాల మేజర్‌ జనరల్స్‌ గురువారం చర్చలకు సిద్ధమయ్యారు. గాల్వన్‌లో ఉద్రిక్త పరిస్థితులపై ఉన్నతస్థాయి చర్చలు జరుపుతున్నట్లు సైనిక వర్గాలు ప్రకటించాయి. సరిహద్దులో శాంతిని నెలకొల్పే దిశగా చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తమైన పరిస్థితులు సద్దుమణిగే వరకు వివాదాస్పద ప్రాంతాల్లో ఎలాంటి సైనిక కార్యక్రమాలకు పాల్పడకుండా ఉండే విధంగా చర్చలు సాగుతున్నట్లు సమాచారం. అలాగే ఈనెల 15, 16 తేదీల్లో గాల్వన్‌లో జరిగిన హింసాత్మక ఘర్షణ కూడా చర్చకు వచ్చినట్లు సైనిక వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. (భారత్‌ను దెబ్బతీసేందుకు త్రిముఖ వ్యూహం)

కాగా గాల్వాన్‌ లోయలో భారత్, చైనా సైనికలు మధ్య ఘర్ణణ చెలరేగడంతో 20 మంది భారత సైనికులు అసువులు బాయగా, కొందరు చైనా సైనికులు గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సరిహద్దుల మధ్య మరోసారి యుద్ధ వాతావరణం తలపించింది. చైనాపై ప్రతీకారం తీసుకోవాల్సిందేనని యావత్‌ భారత్‌ ముక్తకంఠంతో నినదిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సరిహద్దు దేశాల నడుమ యుద్ధం చోటుచేసుకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కొక తప్పదన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో చర్చలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. (సరిహద్దు ఘర్షణలో సరికొత్త సవాళ్లు)

సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఈనెల 23న భారత్‌, రష్యా, చైనా విదేశాంగ మంత్రులు భేటీ కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీకానున్న విదేశాంగ మంత్రులు సమావేశం కానున్నారు. ఈ భేటీలో కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
 

మరిన్ని వార్తలు