రణరంగంగా మెరీనా బీచ్‌

24 Jan, 2017 02:15 IST|Sakshi
రణరంగంగా మెరీనా బీచ్‌

► పోలీస్‌స్టేషన్ దహనం  
► వాహనాలు దగ్ధం
► ఆందోళనకారులపై లాఠీచార్జీలు
► సంఘ విద్రోహశక్తులుగా అనుమానం
► అట్టుడికిన రాష్ట్రం


ప్రశాంతంగా సాగుతున్న జల్లికట్టు ఉద్యమం ఉద్రిక్తతలకు దారితీసింది. జల్లికట్టు ఉద్యమాన్ని విరమించాలని కోరినందుకు ఆగ్రహించిన  ఆందోళనకారుల విధ్వంసంతో రాష్ట్రం అట్టుడికిపోయింది. చెన్నైలో పోలీస్‌స్టేషన్ దహనం, వాహనాల దగ్ధం, లాఠీచార్జీలు, భాష్పవాయువు ప్రయోగాలతో రాష్ట్రం రణరంగంగా మారిపోయింది.

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళుల సంప్రదాయ జల్లికట్టుపై విధింపబడి ఉన్న నిషేధాన్ని తొలగించాలని కోరుతూ వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్న సంగతి పాఠకులకు విదితమే. మధురై జిల్లా అలంగానల్లూరులో ఈ నెల 16వ తేదీన, చెన్నై మెరీనాబీచ్‌లో 17వ తేదీన ఆందోళనలు ప్రారంభమయ్యాయి. వీరికి మద్దతుగా రాష్ట్రం లోని ప్రజలంతా ఎక్కడికక్కడ ఉద్యమించారు. 20వ తేదీన భారీస్థాయిలో బంద్‌ నిర్వహించగా ప్రపంచమే నివ్వెరపోయేలా ఆందోళనకారులు బంద్‌ను విజయవంతం చేశారు. ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ అనుమతి తీసుకుని ఈ నెల 21వ తేదీన జల్లికట్టుకు అనుమతిస్తూ ఆర్డినెన్స్ ను తీసుకువచ్చారు. ఆర్డినెన్స్ వార్త వెలువడిన తరువాత కూడా ఉద్యమకారులు ఆందోళనను విరమించలేదు.

చెన్నై మెరీనాబీచ్‌ను వీడిపోలేదు. ఆర్డినెన్స్  తాత్కాలిక ఊరట మాత్రమే, శాశ్వత చట్టం తెచ్చేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదని భీష్మించుకున్నారు. రాష్ట్రం నలుమూలలా అదే జోరున జల్లికట్టు ఉద్యమాలు సాగుతూనే ఉన్నాయి. ఆర్డినెన్స్  తెచ్చిన రోజున రెండుసార్లు మీడియా వద్దకు వచ్చిన సీఎం ఇది శాశ్వత చట్టంగా రూపొందుతుందని మొరపెట్టుకున్నా ఆందోళనకారులు వినిపించుకోలేదు. ఈ నెల 26వ తేదీన రిపబ్లిక్‌డే వేడుకలకు ఇక మూడు రోజులే ఉన్న తరుణంలో, చెన్నై మెరీనాబీచ్‌రోడ్డే వేడుకలకు వేదిక కావడంతో ఆందోళనకారులను బలవంతంగా ఖాళీ చేయించక తప్పలేదు. సోమవారం తెల్లవారుజాము నుంచి ఆందోళనకారులతో పోలీసులు చర్చలు జరిపినా, పలువురు ప్రముఖులతో చెప్పించినా వినకపోవడంతో పెద్ద సంఖ్యలో మెరీనాను చుట్టుముట్టారు. బతిమాలినా వినకపోవడంతో లాఠీలకు పని చెప్పారు.

ఆందోళనకారులను బలవంతంగా లాగివేశారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో భాష్పవాయువును ప్రయోగించారు. గాలిలోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టారు. కొందరు ఆందోళనకారులు సముద్రంలోకి వెళ్లి నిలబడి బెదిరించడంతో పోలీసులు వెనుదిరగాల్సి వచ్చింది. అయితే సముద్రంలోని వారికి ఆహారం, తాగునీరు అందకకుండా చేయడంతో ఒకరొకరుగా సముద్రం నుంచి వెలుపలకు వచ్చేశారు. జల్లికట్టు ఉద్యమకారులపై చెన్నైలో లాఠీచార్జీ చేశారనే సమాచారం రాష్ట్రంలో మరింత ఉద్రిక్త పరిస్థితులు సృష్టించింది. మధురై, కోయంబత్తూరు, విరుదునగర్, సేలం తదితర జిల్లాల్లో ప్రజలు రోడ్లపై బైఠాయించారు. వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది.

అగ్నికి ఆహుతైన ఐస్‌హౌస్‌ పోలీసు స్టేషన్
చెన్నై మెరీనాతీరంలో పోలీసులు చెదరగొట్టిన ఆందోళనకారుల్లో 50 మంది అక్కడికి సమీపం ట్రిప్లికేన్ లోని ఐస్‌హౌస్‌ పోలీసు స్టేషన్ కు వచ్చి రెచ్చిపోయారు. పోలీసులు వారించినా వినిపించుకోకుండా పెట్రోలో బాంబులు విసిరారు. పోలీసు స్టేషన్ బైట తాళం పెట్టి దగ్ధం చేశారు. పోలీసు స్టేషన్ నుంచి మంటలు ఎగిసిపడుతుండగా లోన చిక్కుకుని ఉన్న 14 మంది సిబ్బంది కిటీకి తలుపులు పగలగొట్టుకుని బయటకు వచ్చారు. సరిగ్గా ఇదే సమయంలో పోలీసు స్టేషన్ వాకిట ఉన్న ద్విచక్రవాహనాలు, నగరంలో కొన్ని చోట్ల నాలుగు కార్లను దగ్ధం చేశారు. పరస్పర దాడుల్లో పోలీసులు, ఉద్యమకారులు తీవ్రంగా గాయపడ్డారు. లాఠీచార్జీకి నిరసనగా చెన్నైలోని అన్ని కూడళ్లలో కొందరు రాస్తారోకో చేసి అలజడి సృష్టించారు. ఎట్టకేలకు సోమవారం సాయంత్రానికి చెన్నై మెరీనా తీరాన్ని పోలీసులు ఖాళీ చేయించగలిగారు.

ఆందోళన వెనుక అదృశ్యశక్తులు
ఇన్నాళ్లూ శాంతియుతంగా సాగిన ఆందోళనలు సోమవారం అకస్మాత్తుగా ఉద్రిక్తతకు దారితీయడం వెనుక అదృశ్య శక్తులు ఉన్నాయని అనుమానిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సంఘ విద్రోహ శక్తులను ప్రవేశపెట్టి ఉండవచ్చని అనే అనుమానం పోలీసు వర్గాలను కలవరపాటుకు గురిచేశాయి. ఇది పసిగట్టే మెరీనా తీరాన్ని ఖాళీ చేయించేందుకు పోలీసులు సిద్ధపడ్డారు. అయితే అంతలోనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రశాంత ఉద్యమంలో పోలీసులు జోక్యం చేసుకోవడమే ఉద్రిక్తతకు కారణమని ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్  వ్యాఖ్యానించారు. రాష్ట్రం రణరంగంగా మారిపోయిన తరుణంలో ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సోమవారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా