ఢిల్లీని మించిన తమిళనాడు

1 Jul, 2020 04:33 IST|Sakshi

కోవిడ్‌ కేసుల్లో మహారాష్ట్ర తర్వాత స్థానం 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి రోజురోజుకూ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోంది. మంగళవారం కొత్తగా 18,522 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసులు 5,66,840కి ఎగబాకాయి. అదేవిధంగా, ఒక్కరోజులోనే 418 మంది కరోనా బాధితులు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 16,893కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.. అత్యధిక పాజిటివ్‌ కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలోనే ఉండగా, రెండో స్థానంలోకి ఢిల్లీకి బదులు తమిళనాడు వచ్చి చేరింది. ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం..మహారాష్ట్ర 1,69,883 పాజిటివ్‌ కేసులతో దేశంలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఒక్క రోజులోనే 4 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో మొత్తం 86,224 కేసులతో తమిళనాడు రెండో స్థానంలోకి వచ్చేసింది. ఆ తర్వాత ఢిల్లీ(85,161), గుజరాత్‌(31,938), యూపీ(22,828), బెంగాల్‌(17,907) తదితర రాష్ట్రాలున్నాయి. కేసులు పెరగడంతో కర్ణాటక హరియాణాను మించింది.

పెళ్ళింట కలకలం రేపిన కరోనా 
పాట్నా జిల్లాలోని పాలిగంజ్‌లో జరిగిన ఓ పెళ్ళి సందడి 100 మందిని కోవిడ్‌బారిన పడేసింది. గురుగ్రామ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన ఆ వ్యక్తికి జూన్‌ 15న పెళ్లయింది. తనకు కరోనా ఉందేమోనని, పెళ్లి వాయిదావేద్దామని అతను చెప్పినా కుటుంబీకులు వినకుండా పెళ్లిచేశారు. ఆ తర్వాత జూన్‌ 17న పరిస్థితి విషమించి పట్నాలోని ఎయిమ్స్‌ ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గం మధ్యలో నవవరుడు మరణించాడు. అయితే కోవిడ్‌ పరీక్షలు జరపకుండా అంత్యక్రియలు నిర్వహించేశారు. గ్రామస్థులు జిల్లా మేజిస్ట్రేట్‌కు సమాచారమివ్వడంతో పెళ్ళికి హాజరైన దగ్గరి బంధువులందరికీ కరోనా పరీక్షలు జరపగా పదిహేను మందికి పాజిటివ్‌ వచ్చింది. వివాహమైన చోటనే ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసి శాంపిల్స్‌ సేకరించారు. అందులో 86 మందికి కరోనా సోకగా, పాజిటివ్‌ వ్యక్తుల్లో చాలా మందికి లక్షణాలు లేవు.

>
మరిన్ని వార్తలు