ఒక్కసారిగా 67 శాతం ఛార్జీలు పెరిగాయి

20 Jan, 2018 13:08 IST|Sakshi

సాక్షి, చెన్నై : దాదాపు ఆరేళ్ల తర్వాత తమిళనాడులో బస్సు ఛార్జీలు పెరిగాయి. ఊహించని రీతిలో 67 శాతం పెంచి రవాణా శాఖ పెద్ద షాకే ఇచ్చింది. కాగా, శనివారం నుంచే పెంచిన ధరలు అమలులోకి వచ్చాయి. ఇక పెరిగిన ధరలను ఓసారి పరిశీలిస్తే... 

చెన్నై నగర పరిధిలోని మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ పరిధిలో టికెట్‌ కనిష్ఠ ధరను 5 రూపాయలుగా నిర్ణయించింది. ఇంతకు ముందు అది 3 రూపాయలుగా ఉండేది. గరిష్ఠ ధరను 14-23 రూపాయలుగా సవరించింది. నాన్‌-మెట్రో ఛార్జీల విషయంలో 3రూ. నుంచి 5. రూలకు పెంచి.. గరిష్ఠ ధరను 12 నుంచి 19 రూపాయలకు సవరిచింది. గ్రామీణ సర్వీసులు, ఆర్టీనరీ సర్వీసులపై మినమిమ్‌ టికెట్‌ ధరను ఒక రూపాయి పెంచి 6 రూ. గా నిర‍్ణయించింది. ఎక్స్‌ ప్రెస్‌ బస్సుల మినిమమ్‌ టికెట్‌ ధరను 17 నుంచి 24 రూ. లకు పెంచేసింది. నాన్‌-స్టాప్‌ డీలక్స్‌ బస్సులపై 18 నుంచి 27 రూ., అల్ట్రా డీలక్స్‌ బస్సుల ధరను 21 నుంచి 33 రూపాయలకు పెంచేసింది. 

ఏసీ బస్సు, వోల్వెల సర్వీసులపై ఈ బాదుడు అదే స్థాయిలో కనిపిస్తోంది. ఏసీ బస్సులపై 27 రూపాయల నుంచి 42 రూపాయలకు.. వోల్వో సర్వీసులపై 33 నుంచి 51 రూపాయలకు పెంచేసింది. కొండ ప్రాంత సర్వీసులపై కూడా రేట్లు పెరిగిపోయాయి. ఆర్డీనరీ బస్సుపై మూడు రూపాయలు పెంచి 7రూ.20పై. గా నిర్దారించింది. ఎక్స్‌ప్రెస్‌ బస్సులపై 12 రూపాయలు పెంచి 32 రూపాయలు చేసింది. గతంలో ఇది 20రూ. గా ఉండేది. 

దీనికితోడు టోల్‌ ఛార్జీలు, యాక్సిడెంట్‌ సెటిల్‌ మెంట్‌ క్లెయిమ్స్‌ కోసం ప్రయాణికులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రమాదాల్లో గాయపడినా, ప్రాణాలు కోల్పోయినా.. బాధితులకు చెల్లించే ఇన్సూరెన్స్‌ విధానాల్లో కూడా ప్రభుత్వం గణనీయమైన మార్పులు చేసింది. చివరిసారిగా 2011లో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఛార్జీలు పెంచారు.

పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే... 
కాగా, ఛార్జీల పెంపుపై తమిళనాడు రవాణా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. రవాణా వ్యవస్థ ఇప్పటికే నష్టాల్లో ఉండగా..  జీతాలు పెంచాలని రవాణ సంస్థ ఉద్యోగులు చేసిన సమ్మెతో అవి భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలను అనుసరించి ధరలను పెంచాల్సి వచ్చింది’’ అని తమిళనాడు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.   పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌, కేరళ, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే ఈ పెంపు చాలా తక్కువేనని, ఈ రాష్ట్రాలు మూడేళ్లు ముందే బస్సు ఛార్జీలను గణనీయంగా పెంచాయని రవాణా శాఖ వివరించింది. రాష్ట్రంలో 8 ప్రభుత్వ రవాణా సంస్థలు, ప్రైవేటు రవాణా సంస్థలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, తప్పని పరిస్థితుల్లోనే ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని రవాణా శాఖ వివరణ ఇచ్చుకుంది.

మరిన్ని వార్తలు