సంక్రాంతి దాకా బస్సులు బంద్‌?

7 Jan, 2018 10:13 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: కోర్టు ఆదేశించినా పట్టువీడలేదు. మంత్రి నోటీసులు జారీచేసినా ఖాతరు చేయలేదు. పైగా జాక్టో, జియోల సంఘీభావంతో రవాణాశాఖ ఉద్యోగ సంఘాల ఉద్యమం మరింత బలపడే దిశగా సాగుతోంది. ఆదివారం నాటికి సమ్మె నాలుగోరోజుకు చేరుకుంది. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో జనం తీవ్రఅవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల తాత్కాలిక డ్రైవర్లను పెట్టి బస్సులు నడిపించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇప్పటి వరకు సమ్మె వల్ల ప్రభుత్వానికి రూ.40 కోట్ల రాబడి ఆగిపోయింది. డిమాండ్లు పరిష్కారం కాకుంటే సంక్రాంతి(పొంగల్‌) వరకూ ఆందోళన కొనసాగించాలని సిబ్బంది భావిస్తున్నారు. పొంగల్‌ సందర్భంగా నడుపాలనుకున్న 12వేల ప్రత్యేక బస్సుల్లో సీట్ల రిజర్వేషన్‌ కూడా పూర్తయిన నేపథ్యంలో అధికారుల గుండెల్లో రైళ్లుపరుగెడుతున్నాయి.

ఎందుకు సమ్మె? : తమిళనాడు ప్రభుత్వ రవాణాశాఖలో 1.43 లక్షల మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. వేతనాలు పెంచాలని, వేతన చెల్లింపుల నుంచి మినహాయించుకున్న సొమ్మును వెంటనే చెల్లించాలనే డిమాండ్‌తో ఈనెల 4వ తేదీ నుంచి సమ్మె పాటిస్తున్నారు. ఆదివారం నాటికి సమ్మె నాలుగోరోజుకు చేరుకోగా రాష్ట్రవ్యాప్తంగా 80 శాతం బస్సులు నిలిచిపోవడంతో సుమారు రూ.40 కోట్ల రాబడికిగండి పడింది. ఉద్యోగులు, విద్యార్థులు, పొరుగూళ్ల నుంచి వచ్చిన వారు బస్సు సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

గందరగోళం.. ఆగమాగం : సమ్మెను నిర్వీర్యం చేయడాన్ని సవాలుగా తీసుకున్న ప్రభుత్వం.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేసేందుకు సిద్ధమైంది. కానీ ఎక్కడిక్కడ ఉద్యోగులు అడ్డుకోవడంతో అవికాస్తా విఫలమయ్యాయి. చెన్నైలో ఐదువేల ప్రైవేటు బస్సులను ప్రవేశపెట్టారు. చెన్నైలోని 35 డిపోల్లో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తోన్న డ్రైవర్లు, కండక్టర్లను విధులకు పంపుతున్నారు. అయితే 16 గంటలపాటు పనిచేయించుకుని రూ.200 మాత్రమే దినసరివేతనం ఇస్తున్నారని కాంట్రాక్టు సిబ్బంది వాపోతున్నారు. కొందరు  డ్రైవర్లు రూట్‌ తెలియక పక్కదారి పడుతుండగా, మరికొందరు ప్రమాదాలు చేస్తున్నారు. దీంతో కొత్త డ్రైవర్లున్న బస్సుల్లో ఎక్కేందుకు ప్రయాణికులు భయపడుతున్నారు. రాష్ట్రం నలుమూలలా ఆందోళనకారులు 24 బస్సుల అద్దాలను పగులగొట్టారు. కోయంబత్తూరులో ఒక తాత్కాలిక డ్రైవర్‌ తలకు హెల్మెట్‌ పెట్టుకుని విధులు నిర్వర్తించాడు. చాలాచోట్ల ఆందోళనకారులు బస్సు టైర్లలో గాలి తీసేశారు. ఇదిలా ఉంటే ప్రైవేటు వాహనాలు ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నాయి.

మెట్రో కళకళ : సాధారణంగా మెట్రో రైలు ప్రయాణం అంతగా ఆసక్తి చూపని చెన్నైవాసులు.. గడిచిన నాలుగు రోజులుగా తీరుమార్చుకున్నారు. సమ్మె మొదలైన నాటి నుంచి 75 వేల మంది ప్రయాణించినట్లు అధికారులు చెప్పారు. ఇక లోకల్‌ ఎలక్ట్రిక్‌ రైళ్లలో శుక్రవారం ఒకే రోజే14 లక్షల మంది ప్రయాణించడం గమనార్హం. మరమ్మతుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించిన దక్షిణ రైల్వే.. సమ్మె కారణంగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించకుంది.

ఉద్యోగులకు నోటీసులు జారీ : సమ్మె విరమించకుంటే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరిస్తూ రవాణాశాఖ మంత్రి ఎం.ఆర్‌.విజయభాస్కర్‌ శనివారం ఉద్యోగులకు నోటీసులు జారీచేశారు. హైకోర్టు ఆదేశించిచా సమ్మెను కొనసాగించడంపై సోమవారం బదులిస్తామని సీఐటీయూ సంఘాలు ప్రకటించాయి. రవాణా ఉద్యోగులు, కార్మికుల కోర్కెలను తక్షణమే నెరవేర్చాలని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌  సీఎంను కోరారు.

గుండెపోటుతో డ్రైవర్‌ మృతి: చెన్నై తాంబరం కన్నడపాళయంకు చెందిన మోహన్‌ (50) అనే ఆర్టీసీ ఉద్యోగి శుక్రవారం రాత్రి గుండెపోటుకుగురై ప్రాణాలు కోల్పోయాడు. అధికారుల ఒత్తిడి వల్లే అతను చనిపోయాడని బంధువులు ఆరోపింస్తున్నారు.

మరిన్ని వార్తలు