తల్లేమో కలెక్టర్‌.. కూతురేమో అంగన్‌వాడిలో

10 Jan, 2019 17:03 IST|Sakshi

చెన్నై : చిన్నాచితకా ఉద్యోగాలు చేసేవారు.. ఆఖరికి కూలి పని చేసుకునేవారు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించడానికి ఇష్టపడరు. అప్పోసప్పో చేసి మరి పిల్లలను ప్రైవేట్‌ స్కూళ్లకే పంపుతారు. అందుకు వారు చెప్పే కారణం.. సర్కారీ బడుల్లో సరిగా చెప్పరని. అందుకు తగ్గట్టుగానే గవర్నమెంట్‌ టీచర్‌ కొలువు చేసే వారు కూడా తమ పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలకే పంపుతారు. ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పే అయ్యవార్లకే తమ పనితనం మీద నమ్మకం లేనప్పుడు ఇక సాధరణ జనాలను మాత్రం అనుకోని ఏం లాభం. కానీ ఈ కలెక్టరమ్మ మాత్రం వీరికి భిన్నం. జిల్లా మొత్తానికి అధికారి హోదాలో ఉన్న కలెక్టర్‌ తన కుమార్తెను మాత్రం ప్రభుత్వ అంగన్వాడి పాఠశాలలో చేర్పించి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.

వివరాలు.. శిల్పా ప్రభాకర్‌ సతీష్‌ 2009 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తన కుమార్తెను అందరిలానే ప్రైవేట్‌ ప్లే స్కూల్‌కు పంపించకుండా తన ఇంటికి సమీపంలోని అంగన్‌వాడి కేంద్రానికి పంపిస్తున్నారు. ఈ విషయం గురించి శిల్ప మాట్లాడుతూ.. ‘నా కూతురు నలుగురితో కలిసిమెలసి ఉండాలని భావిస్తున్నాను. ఈ ఆర్థిక, సామాజిక బేధాలు తనపై ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడ చేర్చాను. ఇవేకాక తాను చాలా త్వరగా తమిళం నేర్చుకోవాలని భావించి ఇక్కడకు పంపుతున్నాను’ అన్నారు.

ఇక రాష్ట్రంలోని అంగన్‌వాడి కేంద్రాల గురించి మాట్లాడుతూ.. ‘తిరునల్వేలిలో వేల కొద్ది అంగన్‌వాడి సెంటర్లు ఉన్నాయి. ఇక్కడ మంచి అనుభవజ్ఞులైన టీచర్లు ఉన్నారు. ఈ అంగన్‌వాడి సెంటర్లన్నింటిలో మంచి పరికరాలు.. ఆటవస్తువులతో పాటు పిల్లలకు అవసరమైన పోషకాహారాన్ని కూడా అందిస్తున్నారు. దాంతో నా కుమార్తెను అంగన్‌వాడి సెంటర్‌కు పంపించాను’ అంటూ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం తమిళనాడులోని ప్రతి అంగన్‌వాడి టీచర్‌కు ఓ స్మార్ట్‌ ఫోన్‌ ఇచ్చారు. దీనిలో ఉన్న ప్రత్యేకమైన యాప్‌లో అంగన్‌వాడి కేంద్రంలోని ప్రతి చిన్నారి ఎత్తు, బరువును నమోదు చేసి ప్రభుత్వానికి అందచేస్తారు. జాతీయ పోషకాహార కార్యక్రమంలో భాగంగా దీన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ఫలితంగా పిల్లల ఆరోగ్యం గురించి తెలియడమే కాక మరింత మెరుగైన కార్యక్రమాల రూపకల్పన గురించి కూడా ఒక అవగాహన ఏర్పడుతుందని చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు