వాచ్ పెట్టుకొచ్చాడని మణికట్టు కోసేశారు

5 Sep, 2014 08:47 IST|Sakshi
వాచ్ పెట్టుకొచ్చాడని మణికట్టు కోసేశారు

మదురై : దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 68 ఏళ్లు గడిచినా ఇంకా  కొన్ని ప్రాంతాల్లో అంటరానితనం కొనసాగుతూనే ఉంది. తాజాగా తమిళనాడులో ఓ దళిత విద్యార్థి పాఠశాలకు వాచ్ పెట్టుకొచ్చాడనే నెపంతో అగ్రవర్ణ విద్యార్థులు అతని మణికట్టు కోశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.  విరుదునగర్ జిల్లా శివకాశిలో పదో తరగతి విద్యార్థి రమేష్ స్కూలుకు వాచ్ పెట్టుకుని వచ్చాడు. ఈ విషయాన్ని గమనించిన అగ్రవర్ణాల విద్యార్థులు సోమవారం అతడి చేత బలవంతంగా చేతి నుంచి వాచ్ తీయించివేశారు. సీనియర్ విద్యార్థుల  చర్యను రమేష్ వ్యతిరేకించటంతో పాఠశాల ఆవరణలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

రెండు రోజుల అనంతరం రమేష్  తిరుత్తణళ్లూరు రైల్వేస్టేషన్ సమీపంలో నడుచుకుంటూ వెళుతుండగా సీనియర్ విద్యార్థులు సహా సుమారు 15మంది బాలురు గ్యాంగ్ అతనిపై దాడి చేసి మణికట్టు కోశారు. అయితే వారి నుంచి తప్పించుకున్న బాధిత విద్యార్థి తీవ్ర రక్తస్రావంతో ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించుకుని అనంతరం శివకాశి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. ఈ ఘటనపై తిరుత్తణళ్లూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి సబంధించి ముత్తుకుమార్ అలియాస్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. కాగా ఇటీవలి ధర్మపురి జిల్లాలో రెండు గ్లాసుల పద్ధతి పెట్రేగుతుండటం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఓవైపు దళిత సామాజికవర్గ సంఘాలు గగ్గోలు పెడుతుండగా తాజా ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు