పరీక్ష రాసినోళ్లందరూ ఫెయిలయ్యారు..

3 May, 2019 09:11 IST|Sakshi

జిల్లా న్యాయమూర్తి నియామక పరీక్షలో సంచలన ఫలితాలు

ఎగ్జామ్‌ రాసిన మూడు వేల మందికి పైగా అభ్యర్థులు 

సాక్షి, చెన్నై:  జిల్లా న్యాయమూర్తి నియామకానికి నిర్వహించిన పరీక్షలో మెజిస్ట్రేట్లు, సివిల్‌ జడ్జిలు, న్యాయవాదులు సహా అందరూ ఫెయిలైన ఘటన తమిళనాడులో జరిగింది. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 31 జిల్లా న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి గాను మద్రాసు హైకోర్టు, తమిళనాడు ప్రభుత్వం సంయుక్తంగా జనవరి 13న పరీక్ష నోటిఫికేషన్‌ను విడుదల చేశాయి. దీనికి 35 ఏళ్ల నుంచి 48 ఏళ్ల మధ్య వయస్సున్న న్యాయవాదులు, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు (ఏపీపీలు), సివిల్‌ కోర్టుల్లో న్యాయమూర్తులుగా, మెజిస్ట్రేట్లుగా పనిచేస్తున్న పలువురు న్యాయమూర్తులు కలిపి 3,562 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షను ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూలుగా మూడు దశలుగా విభజించారు. ప్రిలిమినరీ పరీక్షను రెండు పేపర్లుగా ఏప్రిల్‌ 7న నిర్వహించారు. 

పేపర్‌–1లో సివిల్‌ లా కు సంబంధించి, పేపర్‌–2లో క్రిమినల్‌ లాకు సంబంధించిన ప్రశ్నలను పొందుపరిచారు. మొత్తం 150 మార్కులకు గాను పరీక్షను నిర్వహించారు. ఇందులో రిజర్వేషన్‌ ప్రాతిపదికన మార్కులు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీలకు 150కి గాను 45, బీసీ అభ్యర్థులకు 52.5, ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థులకు 60కి కటాఫ్‌ మార్కులుగా నిర్ణయించారు. ప్రిలిమ్స్‌ పరీక్షకు మూడు వేల మందికి పైగా హాజరయ్యారు. పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. అందులో ఏ ఒక్కరు కూడా ఉత్తీర్ణత సాధించలేకపోవడం విశేషం. దీంతో మే 25,26 తేదీల్లో జరగాల్సిన మెయిన్‌ పరీక్షకు ఒక్కరు కూడా అర్హత సాధించలేకపోయారు. ఈ వ్యవహారం మద్రాసు హైకోర్టు న్యాయవాదులు, న్యాయశాఖ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.   

మరిన్ని వార్తలు