కరోనా భయం: తమిళనాడులో అమానుషం

21 Apr, 2020 15:37 IST|Sakshi
డాక్టర్‌ సిమన్‌​ హెర్క్యూల్స్(ఫైల్‌ ఫొటో)

చెన్నై: మహమ్మారి కరోనా వ్యాపిస్తుందన్న భయం మానవత్వాన్ని మంటగలుపుతోంది. వైరస్‌ బారి నుంచి ప్రజలను కాపాడుతున్న వైద్య, పారిశుద్ధ్య సిబ్బందిపై దాడులకు పురిగొల్పుతోంది. తాజాగా.. న్యూరో సర్జన్‌గా సేవలు అందించిన ఓ డాక్టర్‌ మృతదేహాన్ని తీసుకెళ్తున్న అంబులెన్సుపై మూకదాడి జరిగిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు గాయాలపాలయ్యారు. వివరాలు... వైద్య సేవలు అందించే క్రమంలో కోవిడ్‌-19 బారిన పడిన డాక్టర్‌ సిమన్‌​ హెర్క్యూల్స్‌ ఆదివారం మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇద్దరు వార్డుబాయ్‌లు చెన్నైలోని ఓ శ్మశానవాటికకు అంబులెన్సులో బయల్దేరారు. 

ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న స్థానికులు మృతదేహం కారణంగా తమకు కూడా కరోనా సోకుతుందన్న భయంతో అంబులెన్సుపై దాడి చేశారు. ఇటుకలు, రాళ్లు, బాటిళ్లు, కర్రలతో విరుచుకుపడ్డారు. అక్కడి నుంచి మరో శ్మశాన వాటికకు వెళ్లగా.. అక్కడికి కూడా వచ్చి అంబులెన్సును అడ్డగించారు. డ్రైవర్లు, పారిశుద్ధ్య సిబ్బందిని విచక్షణారహితంగా కొట్టారు. దీంతో మరో వైద్యుడు తానే స్వయంగా అంబులెన్సు నడుపుతూ ఇద్దరు వార్డ్‌బాయ్‌లను తీసుకుని మరోసారి శ్మశానానికి వెళ్లారు. వారితో కలిసి ఎనిమిది ఫీట్ల గుంత తవ్వి డాక్టర్‌ మృతదేహాన్ని పూడ్చారు.(కరోనా: ఆరోగ్య సిబ్బంది మరణిస్తే రూ.50 లక్షలు!)

ఈ విషాదకర ఘటన గురించి డాక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘డాక్టర్‌ సిమన్‌ మృతదేహాన్ని తీసుకువెళ్లిన సిబ్బందిపై స్థానికులు దాడిచేశారు. వాళ్లు తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో నేను స్వయంగా డ్రైవ్‌ చేసుకుంటూ మరోసారి అంబులెన్సులో శ్మశానానికి బాడీని తీసుకువెళ్లాను. మాపై ఇదే తరహా దాడి జరుగుతుందని భయం వేసింది. అందుకే హడావుడిగా మృతదేహాన్ని కిందకు దించి.. గుంత తవ్వి పూడ్చిపెట్టాం. మా దగ్గరకు రావడానికి, సహాయం చేయడానికి పోలీసులు కూడా భయపడ్డారు’’అని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత దొంగతనంగా డాక్టర్‌ మృతదేహాన్ని పాతిపెట్టాల్సి వచ్చిందంటూ ఉద్వేగానికి లోనయ్యారు. 

కాగా ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు 21 మందిని అరెస్టు చేశారు. ఇక ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన మద్రాస్‌ హైకోర్టు వివరణ కోరుతూ తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. భారత వైద్య సమాఖ్య సైతం ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులతో డాక్టర్లకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేసింది. కరోనాపై పోరులో ముందుండి యుద్ధం చేస్తున్న వైద్యులు చనిపోతే వారి పట్ల ఇలా అనాగరిక చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని మండిపడింది. ఇలాంటి ఘటనలు ఆపే శక్తి ప్రభుత్వానికి లేకపోతే పాలన సాగించే నైతిక హక్కు కోల్పోయినట్లేనని ఘాటుగా విమర్శించింది.

మరిన్ని వార్తలు