గవర్నర్‌కు ఆ అధికారం లేదు

12 Sep, 2018 02:05 IST|Sakshi

రాజీవ్‌ హంతకుల విడుదల సిఫార్సులపై హోం శాఖ వర్గాలు

న్యూఢిల్లీ: రాజీవ్‌ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషుల్ని విడుదల చేసేందుకు తమిళనాడు గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌కు ఎలాంటి అధికారాలు లేవని కేంద్ర హోం శాఖ వర్గాలు పేర్కొన్నాయి. రాజీవ్‌ హంతకుల్ని విడుదల చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్ర గవర్నర్‌కు సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ నేతృత్వంలోని బృందం దర్యాప్తును ఇంకా కొనసాగిస్తున్నందున.. దోషులకు శిక్ష తగ్గింపు లేదా రద్దు నిర్ణయం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని గవర్నర్‌ సంప్రదించాల్సి ఉంటుందని హోం శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

రాజీవ్‌ గాంధీ హత్య వెనుక భారీ కుట్ర కోణంపై విచారణ కొనసాగుతోందని, న్యాయ సాయం కోసం వివిధ దేశాలకు లేఖలు రాశామని సీబీఐ సారథ్యంలో మల్టీ డిసిప్లినరీ మానిటరింగ్‌ ఏజెన్సీ కొద్ది నెలల క్రితం సుప్రీంకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. సీఆర్‌పీసీ, 1973లోని సెక్షన్‌ 435 ప్రకారం శిక్ష తగ్గింపు, రద్దు కోసం కేంద్రంతో సంప్రదింపుల అనంతరం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.

మరిన్ని వార్తలు