క్షౌరశాలే గ్రంథాలయం

30 Dec, 2019 21:28 IST|Sakshi

సాధారణంగా ఏ సెలూన్‌లోనైనా అద్దాలు, కత్తెరలు, షాంపూలు, సబ్బులు తదితర సామగ్రి మాత్రమే ఉంటాయి. అయితే తమిళనాడుకు చెందిన పొన్‌మారియప్పన్‌ మెన్స్‌ బ్యూటీ హెయిర్‌ సెలూన్‌ మాత్రం పుస్తకాలతో  నిండి ఉంటుంది. 

చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడికి చెందిన పొన్‌మారియప్పన్‌ చిన్నప్పటి నుంచి చదువంటే చాలా ఇష్టం. అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు కాస్తా మధ్యలోనే ఆగిపోయింది. బతుకుతెరువుకోసం ఓ క్షౌరశాల ప్రారంభించాడు. అయినప్పటికీ కంటపడిన ప్రతి పుస్తకమూ చదివేవాడు. ఈ అలవాటు క్రమేణా పుస్తకసేకరణపై ఆసక్తిని పెంచింది. మొదట స్క్రాప్‌ డీలర్ల నుంచి పుస్తకాలను సేకరించేవాడు. ఆ తర్వాత ప్రతి నెలా తన ఆదాయంలో కొంత మొత్తాన్ని వెచ్చించి పుస్తకాలు కొనుగోలు చేశాడు. వీటన్నింటిని తన దుకాణంలో అందంగా ఆల్మారాల్లో ఉంచాడు. 

దుకాణంలోకి వచ్చిన వినియోగదారులు కొంతమంది వాటిల్లో తమకు నచ్చినవి చదువుకునేవారు. దీనిని గమనించిన మారియప్పన్‌ తన దుకాణానికి వచ్చే ప్రతి ఒక్కరితో పుస్తకాలు చదివించాలని నిర్ణయించుకున్నాడు. ఇందు కు ఓ ఉపాయం ఆలోచించాడు. అదే రాయితీ. తీసుకున్న పుస్తకంలో పదిపేజీలు చదివితే బిల్లులో 30 శాతం రాయితీ వస్తుంది. అయితే రాయితీ ఇచ్చినంతమాత్రాన అంద రూ చదువుతారనే నమ్మకమేమీ లేదు. ఇందు కు కారణం ఇప్పుడు అందరూ సెల్‌ఫోన్‌లో మునిగితేలుతుండడమే. ‘సెల్‌ఫోన్‌ వాడరాదు’ అనే బోర్డు ఏర్పాటు చేశాడు.  

దీంతో అక్కడికి వచ్చినవారు సెల్‌ఫోన్లను జేబులో పెట్టుకుని పుస్తకాలు పట్టుకోవడంమొదలైంది. అంతరించిపోతున్న పుస్తక పఠనాన్ని పునరుద్ధరించడంలో కృతకృత్యుడైనందుకుగాను అందరూ మారియప్పన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. అంతేకాకుండా చాలా మంది పుస్తకాలను విరాళంగా అందజేస్తు న్నారు. ఓ ఎంపీ 50 పుస్తకాలను విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం ఈ క్షౌరశాలలో 900 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆలోచన నచ్చడంతో మాజీ క్రికెటర్‌ హర్ష భోగ్లే... మారియప్పన్‌ను అభినందించారు.  

మరిన్ని వార్తలు