విధుల్లో చేరిన రోజే సస్పెన్షన్

9 May, 2014 03:27 IST|Sakshi
విధుల్లో చేరిన రోజే సస్పెన్షన్

న్యూఢిల్లీ/చెన్నై: తమిళనాడు కేడర్ ఐపీఎస్ అధికారిణి అర్చన రామసుందరం(56)కు విచిత్ర పరిస్థితి ఎదురైంది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐలో మొదటి మహిళా అదనపు డెరైక్టర్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించిన కాసేపటికే ఆమెను సస్పెం డ్ చేస్తూ తమిళనాడు ప్రభత్వం నిర్ణయం తీసుకుంది. అదనపు డెరైక్టర్‌గా బాధ్యతలు తీసుకునేముందు పాటించాల్సిన విధి, విధానాలను ఉల్లంఘించడం వల్లనే ఆమెను సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. అర్చన రామసుందరం సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని, క్రమశిక్షణ చర్యల ప్రక్రియ కొనసాగుతున్నందున ఆమె చెన్నైలోనే ఉండాలని రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
 
 కేంద్ర విజిలెన్స్ కమిషన్, కేంద్ర హోం శాఖ వ్యతిరేకించి, వేరే అధికారి పేరును సూచించినప్పటికీ సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా అదనపు డెరైక్టర్ పదవికి అర్చన పేరును సిఫారసు చేశారు. దాంతో ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ అర్చనను ఖరారు చేసింది. సీబీఐలో జాయింట్ డెరైక్టర్ హోదా అందుకున్న మొదటి మహిళ కూడా ఆమెనే కావడం విశేషం. అదనపు డెరైక్టర్‌గా ఆమె నియామకాన్ని సవాలు చేస్తూ జర్నలిస్ట్ వినీత్ నారాయణ్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విచారణ శుక్రవారం జరగనుంది.

మరిన్ని వార్తలు