చిన్నబోయిన చెన్నై

4 Apr, 2020 10:53 IST|Sakshi
లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిర్మానుష్యంగా తాంబరం రోడ్డు

తమిళనాడును కబలిస్తున్న కరోనా

జాతీయ స్థాయిలో రెండో స్థానం

కరోనా కల్లోలిత ప్రాంతంగా ప్రకటన

411కు పెరిగిన పాజిటీవ్‌ కేసులు సేలంలో ఒకరి మృతి

కరోనావైరస్‌ తమిళనాడును అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్‌ ధాటికి తమిళులు విలవిల్లాడుతున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో రాష్ట్రానికి రెండో స్థానం దక్కింది. కరోనా కల్లోలితప్రాంతంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం ఒక్కరోజే 102 కేసులుబయటపడ్డాయి. పాజిటీవ్‌ కేసులు సంఖ్య మొత్తం 411కు పెరిగింది. ఈ వైరస్‌లక్షణాలతో 1,580 మంది వైద్య నిఘాలో ఉన్నారు. 

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆనోట ఈనోట వినడమేగానీ మనకు రాదులే అని రాష్ట్ర ప్రజలు నింపాదిగా వ్యవహరించారు. ఉరుములేని పిడుగులా కరోనా వైరస్‌ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఢిల్లీ జమాత్‌ సదస్సుకు హాజరైన వారి ద్వారా కరోనా వ్యాప్తి విపరీతం కావడంతో పదుల సంఖ్యలో ఉండిన కేసులు వందల సంఖ్యకు చేరింది. బుధవారం 110 కేసులు, గురువారం 74 కేసులతో జమాత్‌ ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారు పాజిటీవ్‌ కేసులను భారీగా పెంచారు. ఆరోగ్యశాఖ కార్యదర్శి బీలారాజేష్‌ గురువారం రాత్రి ప్రకటించిన బులెటిన్‌ ప్రకారం రాష్ట్రంలో మొత్తం 309 కేసులు నమోదైనట్టు తెలిపారు. దేశం మొత్తం మీద పాజిటీవ్‌ కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, తమిళనాడు రెండో స్థానానికి చేరుకోవడం ఆందోళనకరంగా మారింది.

పది శాతానికి పెరిగిన సంచారుల సంఖ్య
ఇళ్లను వదిలి బయటకు రావద్దని, స్వీయ గృహనిర్బంధం విధించుకుని కరోనా వైరస్‌ కట్టడికి సహకరించాలని ప్రభుత్వం ఎంతగా మొత్తుకున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో 5 శాతం ప్రజలు లాక్‌డౌన్‌ ఆంక్షలను అతిక్రమించి రోడ్లపై తిరుగుతున్నారని రెవెన్యూశాఖ కార్యదర్శి డాక్టర్‌ రాధాకృష్ణన్‌ గురువారం ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం నాటి లెక్కల ప్రకారం 46,970 మందిని అరెస్ట్‌ చేసి సొంతపూచీకత్తుపై వదిలిపెట్టారు. అలాగే 42,035 మందిపై కేసులు పెట్టారు. 35, 206 వాహనాలను సీజ్‌ చేశారు. 26 జిల్లాల్లో 2.75 లక్షల మందికి వైద్యపరీక్షలు చేస్తున్నారు. సంచారుల సంఖ్య ఐదు శాతమని తేలడంతో ఖంగారుపడిన ముఖ్యమంత్రి ఎడపాడి సహా మొత్తం యంత్రాంగం గురువారం చేతులు జోడించి ప్రజలను వేడుకుంది. ఈ విజ్ఞప్తులతో సంచరించేవారి సంఖ్య తగ్గకపోగా శుక్రవారం నాటికి పది శాతానికి చేరుకుంది. దేశం మొత్తం మీద కరోనా తీవ్రత ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా, తమిళనాడు రెండో స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 37 జిల్లాలకు గాను 26 జిల్లాల్లో కరోనా వ్యాపించి ఉండగా, గణాంకాలను బట్టి అన్ని జిల్లాలకు ఈ వైరస్‌ వ్యాప్తి చెందేపరిస్థితి ఉందని ప్రభు త్వం అంచనావేసింది. కరోనా వైరస్‌ కల్లోలిత రాష్ట్రంగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 86,342 మంది గృహనిర్బంధంలో ఉన్నారు.  

జిల్లాల వారీగా కేసులు  
చెన్నై 46, ఈరోడ్‌ 32, తిరునెల్వేలి 30, కోయంబత్తూరు 29, తేని 20, నామక్కల్‌ 18, చెంగల్పట్టు 18, దిండుగల్లు 17, కరూరు 17, మధురై 15, తిరుపత్తూరు 10, విరుదునగర్‌ 10, తిరువారూరు 7, సేలం 6, రాణీపేట్టై 5, కన్యాకుమారి 5, శివగంగై 5, తూత్తుకూడి 5, విళుపురం 3, కాంచీపురం 3, తిరువణ్ణామలై 2, రామనాథపురం 2, తిరువళ్లూరు 1, వేలూరు 1, తంజావూరు 1, తిరుప్పూరు 1 పాజిటీవ్‌ కేసులు బయటపడ్డాయి.  

జమాత్‌ వ్యక్తి సహా ముగ్గురి మృతి
ఢిల్లీ జమాత్‌ సదస్సులో పాల్గొని సేలంకు చేరుకున్న 58 ఏళ్ల వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. సేలం నుంచి రాగానే గృహనిర్బంధంలో ఉండిన అతడు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై ప్రాణాలు విడిచాడు. కరోనా వైరస్‌ మరణంగా ప్రభుత్వం ఇంకా నిర్ధారించలేదు. తిరుపత్తూరు జిల్లా ఆంబూరు సమీపంలో కల్తీసారాయి తాగి వెంకటేశన్‌ (52) మరణించాడు. తిరువణ్ణామలై జిల్లా ఆరణి పోలీస్‌స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ కుప్పన్‌ (47) గుండెపోటుకు గురై శుక్రవారం మృతి చెందాడు.

మరిన్ని వార్తలు