నెలసరి ఉన్నా ఈ గర్భగుడిలోకి వెళ్లవచ్చు!

25 Feb, 2020 20:22 IST|Sakshi

తమిళనాడులో ప్రత్యేక ఆలయం

సద్గురు జగ్జీ వాసుదేవ్‌ ఆశ్రమంలో ‘మా లింగా భైరవి’

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో ఓ ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఈ ఆలయంలో నెలసరి సమయంలో కూడా మహిళలలు పూజలు చేసుకోవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ ప్రత్యేక ఆలయం కోయంబత్తూరులోని సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఆశ్రమంలో ఉంది. దీని పేరు ‘మా లింగా భైరవి’. ఇక్కడ బైరాగిని అమ్మవారు కొలువుదేరి ఉన్నారు. ఈ ఆలయ గర్భగుడిలోకి కేవలం మహిళలకు మాత్రమే అనుమతి ఉండటం మరో విశేషం. సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఉన్నత భావాలు కలిగిన స్వామిజీ అని అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఆశ్రమంలో.. మా లింగా భైరవి ఆలయానికి ప్రతిరోజు పురుషులు, మహిళా భక్తులు దర్శనార్థం వస్తుంటారు.  కానీ ఈ ఆలయ గర్భగుడి లోపలికి వెళ్లి పూజలు చేసుకునే అవకాశం కేవలం మహిళలకు మాత్రమే ఆయన కల్పించారు. దీనికి కారణం రుతుస్రావం సమయంలో వారిని అంటరాని వారిగా చూడకూడదనే ఉద్దేశంతోనే ఈ ఏర్పాటు చేశారు. అదే విధంగా  మహిళలకు రుతుస్రావం అనేది ప్రకృతిలో భాగమనీ.. ఆ సమయంలో మహిళలు గుడికి రాకూడదు, పూజలు చేయకూడదంటూ ఆంక్షలు విధించడం సరైనది కాదని తాను అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు. 

గత జన్మలో మహిళ.. ఈ జన్మలో ఇలా!

ఈ విషయం గురించి నిర్మలా అనే ఆశ్రమ మహిళా సన్యాసిని మాట్లాడుతూ.. ‘ ఇది స్వామీ సద్గురు జగ్గీ వాసుదేవ్‌ నిర్ణయం. రుతుస్రావ సమయంలో మహిళల అభద్రతా భావాన్ని పోగొట్టేందుకే ఆయన ఇలా చేస్తున్నారు. దీంతో బైరాగిని మాతను పూజించుకోవడానికి రోజూ మహిళలు, పురుషులు వస్తారు. కానీ గర్భగుడిలోకి కేవలం మహిళలను మాత్రమే అనుమతించడం పట్ల మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని ఆలయాల్లోని గర్భగుడిలోకి మహిళలకు అనుమతి ఉండక పోవడం.. ఇక్కడ  ఆ ఏర్పాటు ఉండటంతో వారంతా సంతోషిస్తున్నారు’ అని ఆమె చెప్పారు.​

‘నెలసరిలో వంట చేస్తే కుక్కలుగా పుడతారు’

‘‘కంప్యూటర్‌ యుగంలో కూడా చాలా ప్రాంతాల్లో రుతుస్రావంలో ఉన్న మహిళలను, యువతులను అంటరానివారుగా భావిస్తారన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో వారిని ఇంట్లోకి అనుమతించరు. ఇక వారికి తినడానికి ప్లేటు, గ్లాసు విడిగా ఉంచుతారు. ఆ సమయంలో ఇంట్లోని వారంతా వారి పట్ల ప్రవర్తించే తీరు చూస్తే అభద్రత భావం కలుగుతుంది. ఈ ఆచారాన్ని వారు అవమానకరంగా భావించడంతో పాటుగా.. వారి ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది. అందుకే వీటన్నింటికీ అడ్డుకట్ట వేసేందుకే సద్గురు వాసుదేవ్‌ ఇలా చేస్తున్నట్లు’’  నిర్మల తెలిపారు. 

మరిన్ని వార్తలు