భజనలతో చంద్రబాబు మైమరపు!:తమిళ మీడియా సెటైర్లు

14 Apr, 2015 02:32 IST|Sakshi
తమిళ పత్రిక క్లిప్పింగ్

చెన్నై : ఆంధ్రప్రదేశ్, అమరావతి రూపకల్పనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్భాటాలు  రాష్ట్ర ఎల్లలు దాటాయి. ప్రచారపటాటోపం తమిళనాడును తాకింది. పార్టీలోని భజనపరులు పరిధులకు మించి చేస్తున్న 'జింగ్ చాక్' శబ్దాలకు బాబు మైమరిపోతూ ఆనందభాష్పాలు రాలుస్తున్నారంటూ సోమవారం ఓ తమిళపత్రిక వ్యాఖ్యానించింది.

ఆ పత్రిక  వ్యాఖ్యానంలోనే...
  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, కొత్త రాజధాని నిర్మాణ స్థల ఎంపిక కోసం భారత రాజకీయ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో మెగా అన్వేషణ సాగించారు. ఎట్టకేలకూ విజయవాడ- గుంటూరు మధ్య ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి రాజధాని నిర్మాణ పనుల్లో చంద్రబాబు తలమునకలై ఉన్నారు. కొత్త రాజధానికి అమరావతి అనే పేరు కూడా నిర్ధారణ అయింది. అమరావతి ఆవిర్భావం ప్రకటన వెలువడగానే తెలుగుదేశం పార్టీ నేతలు తమ నేత చంద్రబాబుని ఆహా...ఓహో...అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

పురాణ కాలంలో ఇంద్రుడి రాజధాని అమరావతి అని, ఆ పేరునే తమ నేత ఆంధ్రప్రదేశకు పెట్టారని, ఇంద్రుని పరిపాలనలో అమరావతి వీధుల్లో పాలూ, తేనె ప్రవహించిందని, అలాగే తమ చంద్రుని పాలనలో సైతం పాలు, తేనె ఏరులై పారగలదని చెక్కభజన చేస్తున్నారు. అనుచరగణం అభిమానంతో తడిసి ముద్దయిపోయిన చంద్రబాబు, ఆహా...మనవాళ్లు ఎంతబాగా పొగుడుతున్నారని ఆనందభాష్పాలు రాల్చుతున్నారు.

మరిన్ని వార్తలు